నేను గోల్డెన్ స్పూన్ అని ...లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నారా లోకేష్ ఏపీలో డైనమిక్ యంగ్ లీడర్ అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే యంగెస్ట్ టాప్ లీడర్ గా ఉన్నారని చెప్పాలి.;
నారా లోకేష్ ఏపీలో డైనమిక్ యంగ్ లీడర్ అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే యంగెస్ట్ టాప్ లీడర్ గా ఉన్నారని చెప్పాలి. అంతే కాదు భావి ఆంధ్ర ప్రదేశ్ నాయకుడిగా కూడా బలమైన ప్రజా నమ్మకంతో కొనసాగుతున్నారు. నారా లోకేష్ ఈ రోజు తనలోని ప్రతిభా ప్రావీణ్యాలను చూపిస్తూ ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు.
ఆనాడు తొలిసారిగా :
ఇదిలా ఉంటే నారా లోకేష్ పేరు 2009 ఎన్నికల సమయంలో సన్నగా చిన్నగా వినిపించింది. ఆయన టీడీపీకి తెర వెనక సాయం అందించారు అని అంతటా ప్రచారం సాగింది. కానీ లోకేష్ తెర ముందుకు వచ్చింది అయితే లేదు. ఇక 2014 ఎన్నికల సమయంలోనూ లోకేష్ టీడీపీ విజయానికి తెర వెనక ఎంతో కృషి చేశారు అని చెప్పుకున్నారు. అపుడు కూడా ఆయన బయటకు వచ్చింది లేదు, టీడీపీ ప్రభుత్వం విభజన ఏపీలో ఏర్పాటు అయ్యాక లోకేష్ పేరు మెల్లగా వినిపించడం మొదలైంది. అలా 2017 నాటికి ఆయన ఏపీ మంత్రిగా అయిదు కీలక శాఖలతో ప్రమాణం చేశారు. కేవలం రెండేళ్ళు మాత్రమే సమయం ఉండడంతో లోకేష్ ఏమిటి అన్నది ఆనాడు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక 2019లో వైసీపీ వేవ్ లో అందరితో పాటు లోకేష్ ఓటమిని చవి చూశారు.
ఎంతలో ఎంతలా అన్నట్లు :
అయితే ఓటమే విజయానికి సోపానం అన్నది పెద్దల మాట. దానిని స్పూర్తిగా తీసుకుని లోకేష్ 2019 నుంచి 2024 మధ్య తనను తాను రుజువు చేసుకున్నారు. తన ప్రతిభకు పదును పెట్టారు. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే తీరు మారింది. పార్టీ సమావేశాలలో బహిరంగ సభలో ఆయన బాణి వాణి చాలా మారి అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు 2023లో యువగళం పేరుతో ఆయన చేపట్టిన భారీ పాదయాత్రతో లోకేష్ ఏంటితో ఒక్కసారిగా తెలుగు లోకానికి తెలిసివచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయంలో లోకేష్ ది అత్యంత ప్రముఖ పాత్ర అన్నది అసలైన వాస్తవం.
అంతా ఈజీగా రాలేదు :
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నేను ఎన్టీఆర్ మనవడిని, చంద్రబాబు గారి కొడుకుని, బాలయ్య బాబు అల్లుడిని మరి ఇంతలా ఉన్న లోకేష్‌కు ఏంటి గోల్డెన్ స్పూన్ అని అంతా అనుకుంటారు. కానీ నాకు ఏదీ అంత ఈజీగా రాలేదని లోకేష్ చెప్పిన మాటలు అందరిలో ఆలోచనలను నింపాయి. నిజమే లోకేష్ ఎంత బలమైన నేపధ్యం కలిగి ఉన్నా కూడా ఈ రోజుక ఈ స్థాయికి చేరుకోవడానికి అవే కీలకం కావని చెప్పాల్సి ఉంటుంది.
ఓటమి నుంచే గుణపాఠం :
సరిగ్గా అదే మాటను నారా లోకేష్ చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీ 1985 నుంచి గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీ చేసి ఓడిపోయాను అని గతాన్ని ఒక్కసారి తలచుకునారు. ఇలా ప్రతీ వారి జీవితంలో ఓటమి అనేది సహజమే అని ఆయన అన్నారు. అయితే ఆ ఓటమి ద్వారానే ఎవరైనా పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఇక తాను అయితే ఓటమి తరువాత ఎంతగానో పరిశ్రమించాను అని ఆయన చెప్పారు. అలా ఐదేళ్లు కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు.
బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎదిగిపోరు :
దాని ఫలితమే . 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీగా 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పారు. ఇలా లోకేష్ తన జీవితంలో ఓటమి నుంచి నేర్చుకున్న దానిని ఒక స్పూర్తిగా అందరికీ తెలియచేసారు. అంతే కాదు ఓటమిని తలచుకోవడం ద్వారా ఆయన తాను జారిన మెట్టుని గుర్తుంచుకున్నారు. అదే రేపటి కి బలమైన నిచ్చెనగా మారింది అని కూడా చెబుతున్నారు. ఇది నిజంగా ఈనాటి యువతకు ఒక స్పూర్తిదాయమైన విషయమే. ఎందుకంటే ఎవరైనా తమ తండ్రి తాతల నుంచి బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎదిగిపోరు, తాముగా కష్టపడితేనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఇదే నిజం కూడా.