$3.5 బిలియన్ల అప్పు వెంటనే కట్టాలని పాకిస్తాన్ కు యూఏఈ అల్టిమేటం
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడిని తీసుకువస్తున్నాయి.;
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడిని తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పాక్‌కు భారీ షాక్ ఇచ్చింది. గతంలో అందించిన సుమారు $3.5 బిలియన్ (భారత కరెన్సీలో సుమారు ₹32 వేల కోట్లు) అప్పును వెంటనే తిరిగి చెల్లించాలని యూఏఈ ప్రభుత్వం కఠినమైన అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. ఈ అప్పులో 1996-97 సంవత్సరాల్లో తీసుకున్న సుమారు $450 మిలియన్ కూడా ఉండటం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బకాయిలను ఇప్పుడు ఒకేసారి క్లియర్ చేయాలని యూఏఈ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ నిర్ణయం ఆ దేశానికి మరింత భారంగా మారింది.
ఇప్పటికే విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయ అప్పుల ఒత్తిడి పెరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌కు ఈ అల్టిమేటం పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్ )తో కొనసాగుతున్న చర్చల మధ్యలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆర్థిక అనిశ్చితిని మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్‌లో ఉన్న విదేశీ మారక నిల్వలను వినియోగిస్తూ ఈ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొదటి విడతను త్వరలోనే చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఇది సాధ్యమవుతుందా అన్నది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఇంధన దిగుమతులు, ఆహార సరఫరా వంటి కీలక అవసరాల కోసం కూడా డాలర్ల కొరత నెలకొన్న పరిస్థితి ఉంది.
ఆర్థిక నిపుణులు ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకవైపు అప్పులు, మరోవైపు అంతర్గత ఆర్థిక అస్థిరత, పైగా విదేశీ ఒత్తిళ్లు కలిసి పాకిస్థాన్‌ను మరింత సంక్షోభంలోకి నెట్టే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా యూఏఈ ఇచ్చిన ఈ అల్టిమేటం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని మరో కీలక మలుపులోకి తీసుకెళ్లింది. రాబోయే రోజుల్లో పాక్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆ దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.