మరో జగన్ ఎమ్మెల్యే జంపింగ్..?

Update: 2016-02-24 16:31 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు ఏపీ విపక్ష అధినేత వైఎస్ జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న నలుగురు ఎమ్మెల్యేలు.. ఒక ఎమ్మెల్సీ సైకిల్ ఎక్కి షాకిస్తే.. అందులో నుంచి కోలుకోకముందే.. తన అడ్డా అయిన కడప జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరి మరింత షాక్ ఇచ్చారు.

జగన్ కు తిరుగులేని పట్టున్న సొంతం జిల్లా నుంచే ఇద్దరు ఎమ్మెల్యే వచ్చేసిన నేపథ్యంలో.. జగన్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఏపీ అధికారపక్షంలోకి క్యూ కట్టటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ).. బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ తో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిన్న..మొన్నటివరకూ ఉప్పు నిప్పులా ఉన్న వీరిద్దరూ తాజాగా ఒకే కారులో షికారు చేయటం.. నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న పరిస్థితి చూస్తుంటే.. మరో జగన్ పార్టీ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజులు జగన్ కు ఏ మాత్రం సానుకూలంగా ఉన్నట్లు కనిపించట్లేదన్నట్లే ఉంది.
Tags:    

Similar News