కేసీఆర్ సార్.. మీ 50 ఎమ్మెల్యేలను టచ్ లో ఉన్నారట.. జాగ్రత్త

Update: 2020-05-20 06:30 GMT
కాంగ్రెస్ అంటే రెడ్లు.. రెడ్లు అంటే కాంగ్రెస్.. అనాధిగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల గుత్తాధిపత్యంలోనే మగ్గిపోయింది. మహిష్మతికి కట్టప్పలాగా.. కాంగ్రెస్ కు రెడ్లు కట్టుబానిసలుగా మారిపోయారు. తనకు ఎంతో లైఫ్ ఇచ్చిన  తెలుగుదేశంలో వెలుగు వెలిగిన రేవంత్ రెడ్డి సైతం తమ రెడ్ల పార్టీలోనే భవిష్యత్ ఉందని చేరిన పరిస్థితి చూశాం.. కాంగ్రెస్ అంటేనే అదో మహాసముద్రం..  వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు. కానీ బయటోడు వస్తే మాత్రం కలిసి ఎగబడుతారు..  ఘనత వహించిన మన కాంగ్రెస్ పార్టీ దుస్థితిదీ. అవును ఇప్పుడు కాంగ్రెస్ లో ‘రెడ్డి రాజకీయం’ పీక్ స్టేజ్ లో నడుస్తోంది.

తాజాగా పీసీసీ చీఫ్ రేసు తెలంగాణ కాంగ్రెస్ సెగలు పుట్టిస్తోంది. ఈ పోస్టు కోసం దాదాపు 10 మంది వరకు పోటీపడుతున్నారు. రేవంత్ రెడ్డికి చాన్స్ దక్కకుండా లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తానేనని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి చాటింపు వేయించుకుంటున్నారు. ఓ ఇంగ్లీష్ చానెల్ తో తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు.

తాను పీసీసీ అధ్యక్షుడిని అయితే టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి అన్నిరకాలుగా పాటుపడుతానని ఆయన అన్నారు. పాదయాత్రలు, బస్ యాత్రలు చేపట్టి.. నిత్యం ప్రజలతోనే ఉండి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు ఇప్పటికే కాంగ్రెస్ కుదేలైంది. అసెంబ్లీ లో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని దుస్థితికి దిగజారింది. పెద్దలు జానారెడ్డి గారే చరిత్రలోనే తొలిసారి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి తన వరుస రికార్డు విజయాలకు బ్రేక్ వేసుకున్నారు. జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, స్వయంగా కోమటిరెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఎంపీ ఎన్నికల్లో గెలిచారు. ఉద్దండులైన నేతలే గులాబీ కారుకు నిలవలేకపోయారు. దాదాపు సీనియర్లు అంతా కారెక్కేశారు. అలాంటి దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి గట్టెక్కిస్తాననడమే పెద్ద వింత అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా లేని కాంగ్రెస్ పార్టీలోకి 50 మంది గులాబీ ఎమ్మెల్యేలు వస్తారంటున్న కోమటిరెడ్డి మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారు.

ఇంత ఓడినా ఆత్మపరిశీలన చేసుకోకుండా పీసీసీ పీఠం కోసం ఇన్ని రాజకీయాలు.. కుమ్ములాటలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొదట వాటన్నింటికి స్వస్తి పలికి.. నడిపించే నాయకుడిని ఎన్నుకొని తెలంగాణలో స్థిరత్వం సాధిస్తే తప్ప ఆ పార్టీ బతికిబట్టకట్టే చాన్సులు లేవు. అలాంటిది కోమటిరెడ్డి ఏకంగా 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తాననడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆశకైనా హద్దుండాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ముందు కాంగ్రెస్ దుకాణం సర్దుకుంటే మంచిదని.. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి లాగడం చూసుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News