కొత్త కోణం:విమలక్క పాట..కోదండం ఆట

Update: 2015-10-10 05:49 GMT
తెలంగాణ ఉద్యమం ప్రస్తావించిన ప్రతిసారీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం మాష్టారు గురించే. ఉద్యమ సమయంలో ఊహించని విధంగా ఉద్యమకారుల్ని కదం తొక్కించి.. ఢిల్లీలోని కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటంతో పాటు.. వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ సాధనకు కీలకభూమిక వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. చాలామంది మాదిరి పదవుల గురించి ఆలోచించకుండా.. తన అధ్యాపక వృత్తిలోకి వెళ్లిపోయారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ.. మరోవైపు బంగారు తెలంగాణ సాధన కోసం తానేం చేయాలో అది చేసేందుకు విపరీతంగా శ్రమిస్తున్న ఆయన.. ఈ మధ్యన ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల దుస్థితి మీద తీవ్ర వేదనను వ్యక్తం చేసి.. తెలంగాణ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ..  రైతులకు భరోసా కల్పించేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాస్త భిన్నంగా వ్యవహరించారు. ఎప్పుడూ గంభీరంగా ఉంటూ.. నిప్పులు చెరిగే ప్రసంగాలు చేసే ఆయన.. తాజా కార్యక్రమంలో మాత్రం అందుకు భిన్నంగా స్టెప్పులేశారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత విమలక్క పాట అందుకుంటే.. కోదండరాం దానికి అనుగుణంగా కాలు కదిపి కొద్దిపాటి స్టెప్పులేశారు. కోదండం మాష్టారు లాంటి వ్యక్తి స్టెప్పులు వేయటంతో.. ఈ దృశ్యాల్ని చూసిన తెలంగాణవాదులు పులకించిపోయారు.
Tags:    

Similar News