సభలో టీడీపీ చేసిన రచ్చ పై కొడాలి నాని ఫైర్

Update: 2020-01-22 09:30 GMT
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో ఎలాగైనా గందరగోళం సృష్టించాలని చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు. అందుకే తమ ఎమ్మెల్యేల చేత సభను నడవనీయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఉదయం సభలో రైతు భరోసాపై చర్చ జరిగే సమయంలో టీడీపీ నేతలు స్పీకర్ పొడియం వద్ద నినాదాలు చేయడంపై మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రైతు భరోసా కీలకమైన పథకం.. దాని గురించి సభలో చర్చిస్తుంటే అడ్డుకొవడం ఏంటి అని కొడాలి నాని మండిపడ్డారు. అన్నదాత ఇబ్బందుల గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారని చెప్పారు. వారికి సహాయ సహాకారాలు ఎలా అందించాలని అహార్నిసలు శ్రమిస్తున్నారని అన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అని కామెంట్ చేశారని కొడాలి నాని గుర్తుచేశారు. అలాంటి వ్యవసాయాన్ని సీఎం జగన్ పండుగ చేస్తోన్న క్రమంలో అభినందించాల్సింది పోయి.. అడ్డుకోవడం ఏంటీ అని కొడాలి నాని ప్రశ్నించారు. పంటకు మద్దతు ధర కోసం 3 వేల కోట్లను సీఎం జగన్ కేటాయించారని గుర్తుచేశారు. రైతాంగం బాగుండాలని రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరిచ్చేందుకు గోదావరి, కృష్ణా నీటిని పైకి తరలించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కానీ ప్రతి పక్షానికి ఇవేమీ పట్టవని విమర్శించారు.
Read more!

రైతు సంక్షేమం కోసం పనిచేయడం లేదని టీడీపీకి  ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని మంత్రి కొడాలి నాని అన్నారు. 23 సీట్లు ఇచ్చినా బుద్ది, జ్ఞానం లేకుండా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. సభలో గందరగోళం సృష్టించి కీలకమైన అంశాలు మాట్లాడనీయకుండా చేయడమే చంద్రబాబు నాయుడు పని అని విమర్శించారు. టీడీపీ కి  చెందిన 21 మంది సభ్యుల్లో విశాఖకు చెందిన ఇద్దరు సభ్యులు మాత్రం ఆందోళనకు దూరంగా ఉన్నారని, మరో ఇద్దరు ఆందోళన చేయడాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని కొడాలి నాని గుర్తుచేశారు. అచ్చెన్నాయుడు, సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి కూడా వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేయడం ఏంటీ అని ప్రశ్నించారు. బుచ్చయ్య చౌదరి కి 70 ఏళ్లకు పైగా ఉంటాయని, కానీ ఆయన కూడా సభలో హుందాగా ప్రవర్తించడం లేదన్నారు. వారికి బుద్ది, జ్ఙానం ప్రసాదించాలని భగవంతుడిని వేడుకుంటున్నానని చెప్పారు.
Tags:    

Similar News