బీజేపీకి సీఎం అభ్యర్థి దొరికినట్లేనా?

Update: 2019-07-19 16:32 GMT
మరో ఐదేళ్లు పదవి దక్కుతుందని ఆశించి మూడు నెలల ముఖ్యమంత్రి పదవీ యోగాన్ని త్యాగం చేసినా ఐదు సీట్లు కూడా రాజకీయాల్లోంచి అవుటయిపోయారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. లగడపాటి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్లు అయినా గౌరవంగా నిష్క్రమించగలిగారు, కానీ సమైక్యాంధ్రను విభజిస్తారా మీ పదవి వద్దు, మీ పార్టీ వద్దు అని సీఎం పదవికి - పార్టీ సభ్యత్వానికి రాజీ నామా చేసినా ఏపీ ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మలేదు. ఆనాటి పరిణామాలు అలాంటివి. స్వీయ తప్పిదాల వల్ల, కాంగ్రెస్ నిర్ణయాల వల్ల అసంకల్పితంగా అజ్జాత వాసంలోకి వెళ్లిపోయిన ఈ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత తర్వాత కొంతకాలానికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు. అయినా యాక్టివ్ గా వ్యవహరించలేదు. మరోవైపూు కాంగ్రెస్ క్రమంగా పతనం అవుతూ రావడంతో ఇక ఆయన పార్టీని పట్టించుకోవడం మానేసి రాజకీయ అజ్జాతంలో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన పేరు మళ్లీ రాజకీయ తెరపై వినిపిస్తోంది.

బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ మాజీ సీం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి తిరిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారని, ఆయన బీజేపీలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలుగు ప్రజలు బీజేపీలో కొన్ని సంచలన చేరికలు చూడబోతున్నారని ప్రకటించిన మాధవ్ అందులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరును మచ్చుకు బయటపెట్టారు. ఇంకా చేరాల్సిన పెద్ద తలకాయలు చాలా ఉన్నాయని, ప్రస్తుతానికి కిరణ్ బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు.

ఇదిలా ఉండగా... ముఖ్యమంత్రి వంటి కీలక పదవిలో కూర్చోవడమే కిరణ్ యాక్టివ్ రాజకీయాల్లో లేకపోవడానికి కారణమైంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో బీజేపీ యాక్టివ్ గాలేదు. కాంగ్రెస్ శూన్యం. ఇక మిగిలినవి ప్రాంతీయ పార్టీలు. వాటిలో ఒక మాజీ ముఖ్యమంత్రికి స్థానం ఉండదు. ఎందుకంటే అయితే మంత్రి, లేదంటే ఎంపీ...అవ్వాలి. అందుకే ఎటూ దిక్కుతోచక ఆయన వేచిచూసే ధోరణి అవలంబించారు. చివరకు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని చేస్తున్న ప్రయత్నాల్లో ఆయనకు ఒక అవకాశం దొరికినట్లయ్యింది. కీలక నేత కావడంతో అవసరమైతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పనికొస్తాడని భావించిన బీజేపీ ఆయనను సంప్రదించి ఉండొచ్చు. ఆ క్రమంలో మాధవ్ అంత ధైర్యంగా ఈ పేరును ప్రకటించారు. అయితే, మాధవ్ ప్రకటనపై కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల నుంచి ఖండన గాని, సానుకూలత గానీ ఇంకా రాలేదు.



Tags:    

Similar News