సొంత గూటికి కిర‌ణ్ కుమార్‌ రెడ్డి

Update: 2016-09-04 11:16 GMT
వ‌ల‌సల‌తో కుదేలు అవుతున్న కాంగ్రెస్ పార్టీ పాత నేత‌ల‌ను అక్కున చేర్చుకోనుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారా ? ఇన్ని రోజులపాటు అనధికార అజ్ఞాతాన్ని పాటించిన నల్లారి.. మళ్లీ హస్తం ఆహ్వానాన్ని అందుకోనున్నారా ? అంటే కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పటికే ఈ విషయంపై గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు... గులాంనబీ ఆజాద్‌ - దిగ్విజయ్‌ సింగ్‌ లతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో మరో మూడు నెలలు పదవీకాలం ఉండగానే అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన పదవికి,... కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ఏర్పాటును కిర‌ణ్ వ్య‌తిరేకంగా అధిష్టానం విభజనకే మొగ్గు చూపడంతో కిరణ్‌ సీఎం పదవితో పాటు.. దశాబ్ధాల అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఎన్నికలకు ముందు జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి.. ప్రజల్లోకి వెళ్లారు. అయితే అప్పటికే విభజన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. విభజన ఆగడం అసంభవమనే భావనకు రావడంతో సీఎంగా ఉండి పార్టీ పెట్టినా... కిరణ్‌ ను ఎవరూ విశ్వసించలేదు. దీంతో చివరకు ఆయన సొంత నియోజకవర్గం పీలేరులో ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాలతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మధ్యలో ఓ బుక్‌ ఫంక్షన్‌ లో మెరిశారు. అయితే బీజేపీలో చేరేందుకు కిరణ్‌ ప్రయత్నించినట్లు.. ఆ పార్టీ కూడా ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది. అయితే మిత్రులు, స్నేహితుల సలహా మేరకు వెనక్కి తగ్గారు. కిరణ్‌ తండ్రి అమర్‌ నాథ్‌ రెడ్డి కాలం నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్‌ పార్టీకి హార్డ్‌ కోర్‌ ఫ్యామిలీగా గుర్తింపు పొందింది. అలాగే వారు చూపిన నిబద్ధతే కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సీఎం పదవి వరించేలా చేసింది. దీంతో బీజేపీలో చేరాలనే కిరణ్‌ ఆలోచనపై సొంత అనుచరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. అందుకే తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు కిరణ్‌ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి వెంటిలేటర్‌ పై ఉన్న పేషంట్‌ లా తయారైంది. పార్టీలో మెజార్టీ శ్రేణులు టీడీపీ - వైసీపీలో చేరిపోయారు. అయితే ఈ మధ్య కేవీపీ రాజ్యసభలో ప్రత్యేకహోదాపై ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టడంతో మళ్లీ ఏపీలో కొంత చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరి.. పార్టీకి కాయకల్ప చికిత్స చేసేందుకు సిద్ధమవుతున్నారనేది ఆయన అనుచర వర్గం టాక్‌. అయితే కిరణ్‌.. రాహుల్‌ నాయకత్వంపై పూర్తిస్థాయి అంచనాకు రాలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కిరణ్‌ సోదరుడు సంతోష్‌ రెడ్డికి టీడీపీ గాలం వేసింది. అయితే సంతోష్‌ రెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కిరణ్‌ గనుక కాంగ్రెస్‌ లో చేరితే.. దానిని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News