హైదరాబాద్ లో ఉన్న ‘కెన్యా’ అమ్మాయి కతేంటి?

Update: 2015-12-13 08:22 GMT
హైదరాబాద్ లో ఉంటున్న ఒక కెన్యా అమ్మాయి హడావుడి సృష్టించింది. అధికారుల్ని ఉరుకులు.. పరుగులు పెట్టేలా చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న సందేహమే దీనికి కారణం. జయపురాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్న సిరాజుద్దీన్ ను రాజస్థాన్ కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి.. విచారించారు.

అతగాడు ఇస్లామిక్ స్టేట్ సభ్యుడిగా.. సామాజిక నెట్ వర్క్ ల ద్వారా జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఇతడి సోషల్ మీడియాలో అమీనా అనే అమ్మాయి పేరు కనిపించింది. ఆమెకు సంబంధించిన వివరాలు వెతికే పని చేపట్టగా.. ఆమె.. తన స్నేహితుడితో కలిసి భారత్ కు వచ్చినట్లు గుర్తించారు. ఆమె ప్రయాణించిన విమాన టిక్కెట్ల ఆధారంగా ఆమె హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా గుర్తించారు.

వెంటనే రాజస్థాన్ నుంచి వచ్చిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్లారు. పలు కోణాల్లోఆమెను విచారించారు. అనంతరం.. ఆమె వివరాల్ని వివిధ కోణాల్లో పరిశీలించి.. విచారించిన అధికారులు ఐఎస్ తో ఆమెకు సంబంధాలు లేవని ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించి మరిన్ని కోణాల్లో విచారణ జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరి.. ఆ కెన్యా అమ్మాయికి ఐఎస్ సంస్థతో సంబంధాలు ఉన్నాయా? లేవా? అన్నది స్పష్టంగా తేల్చుకోవాల్సి ఉంది.
Tags:    

Similar News