బాబు చేయలేనిది కేసీఆర్ చేసేస్తున్నారు!

Update: 2017-02-24 13:00 GMT
ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న ప్రత్యేకత. తాను చేయాలనుకున్నది ఏదైనా ఆయన చేసేస్తారు. అది పార్టీ నాయకుడిగా తీసుకునే నిర్ణయం కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో వెలువరించే ఆదేశం కావచ్చు. కేసీఆర్ అనుకుంటే అయిపోతుంది. కోర్టులు బ్రేక్ వేస్తే తప్ప! ఇదంతా దేని గురించి అనే కదా మీ సందేహం. మంత్రి వర్గ మార్పు చేర్పుల గురించి. గత ఏడాదిన్నరగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదిగో విస్తరణ - అదిగో శాఖల సర్దుబాటు అంటూ లీకులతో సరిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ మాత్రం చడీచప్పుడు లేకుండా ఇద్దరు కీలక మంత్రుల శాఖలను మార్చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్ ఎస్ పార్టీ పరిణామాలను గమనిస్తున్న వారి ప్రకారం తెలంగాణ మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రానున్న రాష్ట్ర బడ్జెట్ లో బీసీలు - అత్యంత వెనుకబడ్డ బీసీ కులాల (ఎంబీసీ)కు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీసీ - ఎంబీసీ వృత్తులపై అవగాహన కలిగిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కు బీసీ సంక్షేమ శాఖను అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జోగు రామన్న వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను ఈటలకు ఇచ్చి జోగు రామన్నకు పౌర సరఫరాల శాఖను ఇవ్వనున్నారు. దీంతో ఇకపై ఆర్థిక శాఖ, బీసీ సంక్షేమ శాఖలను ఈటల పర్యవేక్షించనున్నారు. జోగు రామన్న పౌర సరఫరాల శాఖతో పాటు గతంలో ఉన్న అటవీ - పర్యావరణ శాఖలను చూసుకుంటారు. ఒకటి రెండు రోజుల్లో ఈ మార్పులకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 అయితే ఏపీ మంత్రివర్గ విస్తరణ - తన తనయుడైన నారా లోకేష్ ను అమాత్యుడిని చేయడంపై చంద్రబాబు ఇప్పటివరకు ముందడుగు వేయకుండా ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యాన్ని ఊహించి తను అనుకున్నది చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని చెప్తున్నారు. కాగా...అసలేమాత్రం కారణం చెప్పకుండా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఎమ్మెల్యేను పదవి ఊడబీకి, ఎంపీగా ఉన్న వ్యక్తికి వెనువెంటనే బాధ్యతలు అప్పజెప్పే అంత దమ్మున్న కేసీఆర్ శాఖల మార్పు విషయంలో మంత్రుల అంగీకారం తీసుకుంటాడా అంటూ కొంతమంది ఆసక్తికరమైన పాయింట్ ను తెరమీదకు తెస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News