మార్చి 31 నాటికి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు

Update: 2018-12-17 11:08 GMT
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా  ప్రతీ ఇంటిలో నల్లా బిగించి - పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు - గుట్టలు - అటవీ ప్రాంతాలు - మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ర్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని - ఖర్చుకు వెనుకాడవద్దని సీఎం స్పష్టం చేశారు.

ప్రగతి భవన్ లో సోమవారం మిషన్ భగీరథపై సిఎం సమీక్ష నిర్వహించారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 23,968 ఆవాస ప్రాంతాలకు గాను - 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నదని వారు చెప్పారు. మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కూడా కొండలు - గుట్టలు - అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓహెచ్ ఎస్ ఆర్ ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నదన్నారు.

దళితవాడలు - ఆదివాసీ గూడేలు - శివారు ప్రాంతాలు - మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని గడువు విధించారు.

మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న సీఎం.. దాన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు - ఇంజనీర్లదే అన్నారు. వారికి అభినందనలు తెలియజేశారు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ప్రాజెక్టును నిర్వహించడంపై దృష్టి పెట్టాలి సిఎం కోరారు.
Tags:    

Similar News