వాయిదా పడితేనే పవర్ పాయింట్ ప్రజంటేషనా?

Update: 2015-10-04 11:30 GMT
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉభయ సభల్ని ఒక చోటకు చేర్చి.. సాగునీటి రంగంపై ప్రభుత్వ ఆలోచనల్ని..కలల్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారు. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తున్నారు కూడా.

ఉభయ సభలను ఉద్దేశించి తాను ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు సంబంధించిన ప్రివ్యూ షోను ఇప్పటికే గవర్నర్ కు ప్రదర్శించిన కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ముఖ్యమంత్రి అనుకున్న వెంటనే అన్నీ జరిగిపోవని.. చాలానే నియమనిబంధనలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఎలా పడితే అలా అసెంబ్లీలో ప్రజంటేషన్ ఇవ్వలేరని.. ప్రొసీజర్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుందని.. దాని ప్రకారం చూస్తే.. ఇప్పుడు అనుకుంటున్న రీతిలో ప్రజంటేషన్ ఇవ్వటం సాధ్యం కాదని చెబుతున్నారు. సాంకేతికంగా చూసినా.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ లాంటి సంప్రదాయాలు లేని నేపథ్యంలో.. సాంకేతికంగా చూసినా సభను వాయిదా వేస్తే కానీ ఇచ్చే వీలుంటుందని చెబుతున్నారు.

ఇప్పుడున్న ఫార్మాట్ లో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ సాధ్యం కాదని.. అలా ఇవ్వాలంటే సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే తప్పించి కుదరదని చెబుతున్నారు. అంతేకాదు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ విషయాలేవీ కూడా అధికారిక రికార్డుల్లో నమోదు కావని చెబుతున్నారు. మరోవైపు.. సభను వాయిదా వేసి.. ప్రజంటేషన్ ఇవ్వాలని భావిస్తే.. విపక్షాలు ఎలా వ్యవహరిస్తాయన్నది మరో అంశంగా ఉంది.

విపక్షాలు కానీ ప్రజంటేషన్ ను అడ్డుకుంటే.. ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఒక సందేహం. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలంగాణ అధికారపక్షం భావించినప్పటికీ.. ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న అంశాల నేపథ్యంలో.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమం జరగటం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి ఒకసారి ఫిక్స్ అయితే.. మళ్లీ వెనక్కి తగ్గరు. మరి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
Tags:    

Similar News