కొత్త ఏడాదిలో యాదాద్రి రీఓపెన్ కు కేసీఆర్ ప్లానింగ్

Update: 2020-09-30 08:30 GMT
ఏపీలో తిరుమలకు తగ్గట్లు తెలంగాణలో యాదాద్రిని డెవలప్ చేయాలన్న పట్టుదలతో వందల కోట్ల ఖర్చుతో ఆలయాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదిగిరిగుట్టను యాదాద్రిగా మార్చి.. భారీ హంగులతో ఆలయాన్ని రూపొందిస్తున్నారు. గడిచిన ఐదేళ్లుగా దీనికి సంబంధించిన పనులు మహా జోరుగా సాగుతున్నాయి.

తాజాగా యాదాద్రిని రీఓపెన్ ఎప్పుడు చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. పనులు తుదిదశకు చేరుకోవటం.. మిగిలిన పనుల్ని రానున్న నాలుగైదు నెలల్లో పూర్తి చేసే లక్ష్యాన్ని విధించినట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త ఏడాదిలో యాదాద్రిని పున: ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి ఆలయాన్ని రీఓపెన్ చేసేందుకు వీలుగా పనులు సాగుతున్నాయి.

పలు నిర్మాణాలు తుది దశకు చేరటం.. యాత్రికులు బస చేసేందుకు వీలుగా ప్రెసిడెన్షియల్ కాటేజీలు.. వీఐపీల కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. వాటికి రంగులు వేసే పనులు సాగుతున్నాయి. ఇటీవల యాదాద్రిని సందర్శించిన కేసీఆర్.. పలు సూచనలు చేశారు. ఆయన చెప్పిన విధంగా పలు మార్పులు చేస్తున్నారు. కొండ పైనే బస్ బే నిర్మాణాన్ని పూర్తి చేయటం.. కేవలం దేవస్థానం బస్సుల్ని మాత్రమే అనుమతించనున్నారు.

ఆలయాన్ని ప్రారంభించే సమయంలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే వెల్లడించారు. దీనికి తగ్గట్లే ఏర్పాట్లు సాగుతున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులకు అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించటంతో పాటు.. అందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని పేర్కొన్నారు. కొత్త ఏడాది మొదట్లోనే యాదాద్రిని ప్రారంభించటం ఖాయమని చెబుతున్నారు.
Tags:    

Similar News