స్పీకర్ ఎవరు.‎‎‎‎.? ఆయన మనసులో ఏముంది..

Update: 2019-01-16 15:36 GMT
తెలంగాణలో రెండో ప్రభుత్వం కొలువు తీరబోతోంది. గురువారం నాడు గెలుపొందిన శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటేమ్ స్పీకర్‌గా ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్‌ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసారు. గురువారంనాడు శాసన సభ్యుల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. శుక్రవారం నాడు తెలంగాణ శాసన సభ.. శాసన మండలి... ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇదే ఇప్పుడు తెలంగాణలో కీలకం కానుంది. గత తెలంగాణ శాసనసభకు మధుసూదనాచారి స్పీకర్ గా వ్యవహిరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి స్పీకర్ పదవి ఎవరి వరిస్తుందో అని అటు పార్టీలోను, ఇటు తెలంగాణవ్యాప్తంగానూ తీవ్ర చర్చ జరుగుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు - హోమంత్రిగా మహమూద్ ఆలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి పదవులు ఇంకా ఎవరికి కట్టబెట్టలేదు. ఇక ఇప్పుడు స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. దీంతో అందరి చూపు స్పీకర్ ఎవరు అనే అంశంపై పడింది. ఎనిమిది మంత్రులతో ప్రమాణం అని కొందరు, కాదు... 16 మందితో మంత్రివర్గమని కొన్ని మీడియాల్లోను కథనాలు వస్తున్నాయి. ఇది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఇక స్పీకర్ పదవి అయితే ఎవరిని వరిస్తుందో అని ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ పదవికి ఆర్ధిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. లేదూ అంటే గత శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన పద్మా దేవేందర్ ను నియమిస్తారంటున్నారు. వీరిద్దరు కాకుండా మరొకరికి ఈ అవకాశం వస్తుందని అంటున్నారు. స్పీకర్ పదవిని తీసుకుందుకు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు సిద్ధంగా లేరు. దీనికి కారణం స్పీకర్ పదవి కంటే మంత్రి పదవే ముద్దు అని భావించడమే అని అంటున్నారు. మొత్తానికి స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేస్తారో మాత్రం ఇంకా తేలకపోవడంతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్లో టెన్షన్ నెలకొంది. స్పీకర్ ఎవరవుతారో.... తమ నాయకుడి మనసులో ఏమందో అని గులాబీ తమ్ముళ్లు ఎదురు చూపులు చూస్తున్నారు. 


Tags:    

Similar News