భోళా శంకర కేసీఆర్.. ఇలా అడగ్గానే ఇచ్చేశాడు!

Update: 2019-11-19 08:16 GMT
భోళా శంకరుడు.. ఇలా తపస్సు చేయగానే అలా వరాలు ఇచ్చేస్తాడు.   తాహతకు మించి వరాళిస్తున్న దేవుడు కాబట్టే ఆయనకు భోళాశంకరుడు అనే పేరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నాడట.. ఎవరైనా తనకు శుభలేక ఇవ్వడానికి వస్తే వారి కష్టాన్ని గుర్తించి పదవుల పందేరం చేస్తున్నాడట.. వరుసగా శుభలేఖలు అందించిన ఇద్దరికీ శుభవార్తలు చెప్పాడట కేసీఆర్. దీంతో ఇప్పుడు శుభలేఖలతో ప్రగతి భవన్ బాట పడుతున్నారట గులాబీ నేతలు.

అడగ్గానే వరాలిస్తే దేవుడంటారు. కానీ ఇప్పుడు టీఆర్ ఎస్ నేతల పాలిట అడక్కుండానే వరాలిచ్చేస్తున్నాడట గులాబీ దళపతి.. కక్కు వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేమంటారు. ఇప్పుడు ఎంతో మొండిగా ఉండే కేసీఆర్ కు కూడా ఆనందం వచ్చినా తట్టుకోలేకుండా ఉంది.. కేసీఆర్ వెంటవెంటనే ఇద్దరు నేతలకు పదవులు ఇచ్చిన వ్యవహారం టీఆర్ ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్ రెండో అధికారంలోకి వచ్చాక మంత్రి పదవుల నుంచి నామినేటెడ్ - కార్పొరేషన్ పదవుల దాకా అన్నింటిలోనూ అంతులేని జాప్యం చేస్తున్నారు. కేసీఆర్ పదవులు భర్తీ చేస్తారని ఆశావహులు అందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా 2014 హయాంలో శాప్ చైర్మన్ గా ఉన్న అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం మాజీ అయిపోయారు. ఆయన పదవిని కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రెన్యువల్ చేయలేదు. అయితే తాజాగా తన కొడుకు వివాహానికి పిలవడానికి ప్రగతి భవన్ కు వచ్చిన ఆయనకు కేసీఆర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నీ శుభలేఖలో ‘శాప్ చైర్మన్’ అని లేదేంటి అని ప్రశ్నించి వెంటనే ఆయనకు అదే పదవి ఇవ్వాలని.. శాప్ చైర్మన్ హోదాలోనే పెళ్లి చేయాలని వెంకటేశ్వర్ రెడ్డికి సర్ ప్రైజ్ ఇచ్చాడట. అనంతరంతో అధికారులతో ఆదేశాలు కూడా ఇప్పించేయడం గమనార్హం...

ఇక ఇదే క్రమంలో హుజూర్ నగర్ లో పార్టీ గెలిపించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తన కొడుకు ఎంగేజ్ మెంట్ కు రావాలని ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ను కోరారు. శుభలేఖ చేతిలో పెట్టగానే ఆయన పార్టీ కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఏకంగా కేబినెట్ హోదా కలిగిన ‘రైతు సమన్వయ సమితి’ అధ్యక్షుడిని చేసి కేసీఆర్ తిరిగి శుభవార్తను అందించాడు.

ఇలా ఇద్దరు నేతలకే కాదు.. ఇటీవలే కేసీఆర్ ను పెళ్లికి ఆహ్వానించిన పిడమర్తి రవి కూడా శుభలేఖ అందించాడు. మరి ఆయనకు కేసీఆర్ వరాలు ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఇలా శుభలేఖలు ఇచ్చిన నేతలకు కేసీఆర్ శుభవార్తలు చెప్పారనే వార్త బయటకు రాగానే గులాబీ ఆశావహులంతా ఇప్పుడు శుభలేఖలతో ప్రగతి భవన్ బాట పడుతున్న పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోందట.. మరి కేసీఆర్ అందరికీ పదవులు ఇస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.

   

Tags:    

Similar News