లక్ష రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాం: కేసీఆర్‌

Update: 2019-01-20 10:40 GMT
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధన్యవాద తీర్మానంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం అని ప్రకటించారు. ప్రతిపక్షాలు అప్పుడే హామీల గురించి అడుగుతున్నాయని.. అవన్నీ కచ్చితంగా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు.

గత ప్రభుత్వ సమయంలో 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు కేసీఆర్‌. ఈసారి 24 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని.. కచ్చితంగా అమలు చేసి తీరతామని ఈ సందర్భంగా కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ఇప్పటికే బ్యాంకర్స్‌ తో మాట్లాడామని.. విదివిధానాలు ఖరారైన తర్వాత రుణమాఫీ పై ప్రకటన ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వ సమయంలో.. ప్రజలకు అవసరం అని మేనిఫెస్టోలో లేని దాదాపు 76 పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టినట్లు చెప్పారు కేసీఆర్‌.

కంటి వెలుగు పథకంలో చాలామంది పేదలకు కళ్లు పోయాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. అసలు చాలామందికి తెలీని విషయం ఏంటంటే.. కంటివెలుగు పథకం ద్వారా ఇంతవరకు ఒక్క ఆపరేషన్‌ కూడ జరగలేదని సభలో చెప్పారు కేసీఆర్‌. రైతు బీమాపథకంతో ఇప్పటివరకు 6,062 మంది రైతు కుటుంబాలకులబ్ధి చేకూరిందని అన్నారు. లోక్‌ సభ ఎన్నికలు పూర్తవగానే పంచాయతీరాజ్‌ చట్టాన్ని వంద శాతం అమల్లోకి చేస్తామని అన్నారు. ధరణి వెబ్‌సైట్‌ లో భూముల వివరాలు పొందుపరుస్తామని.. 100 శాతం భూరికార్డుల ప్రక్షాళన చేస్తామని అన్నారు.
Tags:    

Similar News