లోయా కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో?

Update: 2018-01-13 10:51 GMT
సుప్రీం కోర్టు లో రేగిన సంక్షోభం ఇక్కడితో సమసిపోయే అవకాశం లేదు. ముందు ముందు అనేక పరిణామాలు దీనికి అనుబంధంగా దేశంలో సంచలనాలు నమోదు చేయబోతున్నాయనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. నిన్న నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ పై ధిక్కార స్వరాన్ని వినిపిస్తే ఆ తరువాత.. మరో ఇద్దరు కూడా వారితో గళం కలిపారు. అయితే కేసుల కేటాయింపులో రోస్టర్ విధానం.. ఒక పద్ధతిని అనుసరించకుండా.. ఇష్టమొచ్చిన కేసులను ఇష్టమొచ్చిన బెంచ్ లకు కేటాయించడం వంటి లోపాలను న్యాయమూర్తులు ప్రధానంగా ప్రస్తావించారు. వారు ఫోకస్ పెట్టిన అంశాలు ఇవి కాగా - తక్కువ ఫోకస్ పెట్టిన అంశాలు కూడా వేరే ఉన్నాయి. జస్టిస్ లోయా అనుమానాస్పద మరణం గురించి వారు తక్కువ మాట్లాడారు. అయితే ఈ కేసు వ్యవహారం ముందు ముందు చాలా కీలకంగా మారబోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే సోహ్రబుద్దీన్ హత్య కేసును విచారించిన న్యాయమూర్తి లోయా. ఆయన ఒక ప్రెవేటు కార్యక్రమానికి హాజరై వస్తుండగా.. అనుమానస్పద స్థితిలో మరణించారు. దాని మీద పిటిషన్ విచారణలో ఉంది. ఈ కేసును లోతుగా విచారిస్తే.. రాజకీయ ప్రమేయం ఉన్నట్లుగా ఏవైనా అంశాలు వెలుగులోకి వస్తాయేమో అనే అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తి మరణం వెనుక ఉన్న నిజాలను కూడా తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతుండగా.. ఇక సహించలేకపోయినందునే.. న్యాయమూర్తులు చివరి ప్రయత్నంగా మీడియా ముందుకు వచ్చినట్లుగా కూడా అనుకుంటున్నారు.

లోయా మరణం గురించిన విచారణను తిరగతోడవలసి వస్తే.. కేవలం న్యాయవ్యవస్థలోని వారు మాత్రమే కాకుండా.. రాజకీయనాయకులు కూడా ఇరుక్కునే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా కావొచ్చు గానీ.. సుప్రీం న్యాయవ్యవస్థ మీది ఆరోపణల పర్వం ప్రధానమైంది కాగా, లోయా కేసు అనూహ్యంగా ముందు ముందు అనేక కీలకమలుపులకు కారణం కావచ్చునని పలువురు ఊహిస్తున్నారు.
Tags:    

Similar News