పవన్ పై ఇవేమి పొగడ్తలు జూపూడీ?

Update: 2016-09-01 10:17 GMT
పొగడ్త కూడా ఒక రకమైన బలహీనతే అని ఒకరంటే.. కచ్చితంగా కాదు అని మరికొందరు చెబుతుంటారు. శాస్త్రీయంగా కూడా "పొగడ్త - మనిషి" అనే అంశంపై పరిశీలనలు జరుగుతుంటాయని కూడా చెబుతుంటారు. ఈ విషయంలో మిగిలినవారికంటే రాజకీయ నాయకులు ఒక ముక్క ఎక్కువ చదివారనిపిస్తుంటుంది. పొగిడించుకోవాలన్నా.. సహచరున్ని పొగడాలన్నా కూడా వీరు పీక్స్ కి వెళ్లిపోతుంటారు. మొన్నటివరకూ మోడీ భారతదేశానికి ఆ దేవుడు పంపిన దేవదూత అని కొందరు పొగడితే.. మరి కొందరు దేవదూత కాదు ఏకంగా దైవ సమానుడే అని పొగొడేశారు. ఇవి విన్న మోడీ ఏమనుకున్నారో కానీ.. జనాలు మాత్రం రకరకాలుగా నవ్వుకున్నారు! అయితే తాజాగా ప్రత్యేక హోదాపై పోరాటం అని ప్రకటించిన పవన్ కల్యాన్ పై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ ఎలా పొగిడారో తెలిస్తే పిచ్చెక్కిపోతుందంతే!!

పవన్‌ కళ్యాణ్‌ పై టీడీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌ ఏమన్నారంటే... పవన్‌ సాధారణ రాజకీయ నాయకుడు కాదట. అలా అని కాపు నాయకుడు అనుకునేరు.. అది కూడా కాదట, అంతకు మించి అంట. పవన్ ప్రజల హీరో.. పవన్‌ కళ్యాణ్‌ కాపు జాతికి మాత్రమే చెందిన వాడు కాదు.. ఆయన కులమతాలకు అతీతుడు.. సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలవడానికొచ్చిన సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు అని జూపూడి ఎత్తేశారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా నిజమైనహీరోగా ప్రజలందరీ మన్ననలు అందుకుంటున్న నాయకుడు, పోరాట యోధుడు పవన్‌ కళ్యాణ్‌ అని అన్నరూ జూపూడి. ఇవి పొగడ్తలా... కాదు కాదు అంతకు మించి!

ఈ పొగడ్తలు విన్న పవన్ కి ఎలా ఉంటుందో కానీ.. ఆయన అభిమానులు, తెలుగు దేశం కార్యకర్తలు, సామాన్య జనాలు మాత్రం ఇది జూపూడి మార్క్ పీక్స్ అని చెప్పుకుంటున్నారట. బాబోయ్.. జూపూడి పొగడటం మొదలుపెడితే ఈ స్థాయిలో ఉంటుందా అని ఆయనకున్న అభిమానులు కూడా ముక్కుపై వేలేసుకుంటున్నారట. ఇంతకూ ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే... కాపు ఉద్యమంలో పవన్ ను కలుపుకొనేది లేదని ఆ సామాజికవర్గం కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ప్రకటించినందుకు. ఈ విషయంపై ముద్రగడ ప్రకటనను ఖండించడం మొదలుపెట్టిన జూపూడి స్టీరింగ్ ఇలా పవన్ ప్రశంసలవైపు మళ్లించారు.
Tags:    

Similar News