జనసేన మోసం చేసింది.. గుణపాఠం చెబుతా

Update: 2019-03-24 05:58 GMT
ఏపీలో అదృష్టాన్ని వెతుక్కుంటూ రాజకీయ ప్రయాణం ప్రారంబించిన జనసేన పార్టీకి కూడా ప్రధాన పార్టీల తరహాలోనే అసంతృప్తుల బెడద తప్పడం లేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు దొరక్క ఎవరోఒకరికి టికెట్లిచ్చిన ఆ పార్టీకి కొన్నిచోట్ల మాత్రం టికెట్లు రానివారి నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా పామర్రు టికెట్ ఆశించి భంగపడిన డీవై దాస్ అనే నేత జనసేన అధినేత పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. పవన్ తనను మోసం చేశారని.. ఆయనకు తగిన బుద్ధి చెబుతానని అన్నారు.
    
తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, పార్టీలో చేర్చుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆపై తనను దారుణంగా మోసం చేశారని చెబుతూ ఆయన జనసేనకు రాజీనామా చేశారు. ఇటీవలే జనసేనలో చేరిన డీవై దాసు.. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తనను స్వయంగా ఆహ్వానిస్తే మార్చి 18వ తేదీన వెళ్లి పవన్ ను కలిసి ఆ పార్టీలో చేరానని... టికెట్ ఇస్తానని చెప్పడంతో కార్యకర్తలతో కలిసి ప్రచారం కూడా ప్రారంభించానని ఆయన అన్నారు. అయితే.. తనకు కాకుండా వేరొకరికి టికెట్ ఇచ్చారని ఆయన వాపోయారు.
    
జాబితాలో తన పేరు లేకపోవడంతో మనోహర్ కు ఫోన్ చేశానని, ఆయన సరిగ్గా స్పందించలేదని, పవన్ కార్యాలయం నుంచి పులిశేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాలని పిలిస్తే కార్యాలయానికి వెళ్లానని.. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. తనను మోసం చేసిన జనసేనకు తగిన గుణపాఠం చెబుతానని దాస్ అంటున్నారు.
Tags:    

Similar News