జ‌న‌సేన నేత చ‌లానాల లెక్క తెలిస్తే షాకే!

Update: 2018-08-19 11:30 GMT
బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలంటూ అదే ప‌నిగా చెప్పే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక‌పై ఆ మాట మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందేమో. త‌న పార్టీకి చెందిన నేత‌కు సంబంధించిన ఒక నిర్వాకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అదెలానంటే..

ఏపీలోని తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్రవ‌రానికి చెందిన బాలాజీ అనే పెద్ద‌మ‌నిషి జ‌న‌సేన పార్టీ నేత‌. అత‌గాడికి ఇన్నోవా క్రిస్టా వెహికిల్ ఉంది. దాని నెంబ‌రు ఏపీ05డీఎస్ 8888. ఈ ఫ్యాన్సీ నెంబ‌రు చూసినంత‌నే ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఈ నెంబ‌రు మీద ఉన్న పెండింగ్ చ‌లానాల లెక్క చూస్తే నోట వెంట మాట రాదంతే.

ఏడాదిన్న‌ర కాలంగా ఇష్టారాజ్యంగా వాహ‌నాన్ని న‌డిపేస్తున్న ఇత‌గాడి మీద ప‌లు చ‌లానాలు పెండింగ్‌ లో ఉన్నాయి. ఎన్ని అంటారా?  సింఫుల్ గా 45 చ‌లానాలు. ఊహించ‌ని విధంగా హైద‌రాబాద్ పోలీసులు అత‌గాడి కారును ఆపారు. చెక్ చేస్తే.. భారీ ఎత్తున చ‌లానాలు పెండింగ్ ఉన్న విష‌యాన్ని గుర్తించారు. ఇత‌డి మీద న‌మోదైన కేసుల్లో ఎక్కువ భాగం ఓవ‌ర్ స్పీడ్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన‌ట్లుగా చెబుతున్నారు. ఒక కారు మీద ఇన్ని చ‌లానాలు పెండింగ్‌ లో ఉండ‌టం పోలీసుల‌కు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

అత‌గాడు పెండింగ్‌ లో ఉన్న 45 చ‌లానాల‌కు కాను.. మొత్తంగా రూ.54,773 చెల్లించాల్సి వ‌చ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించ‌కుంటే వాహ‌నాన్ని సీజ్ చేస్తామ‌ని.. ఛార్జిషీట్ వేస్తామ‌ని హెచ్చరించ‌టంతో దారికి వ‌చ్చి త‌న డెబిట్ కార్డు ద్వారా చెల్లింపుల మొత్తాన్ని చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌వ‌న్‌ జీ.. పార్టీ నేత‌ల‌కు కాస్త రూల్స్ ను పాటించ‌మ‌ని చెప్పండి.
Tags:    

Similar News