సంతబేరం.. నాలుగు వికెట్లుగా తేల్చేసిన జగన్

Update: 2016-02-23 04:29 GMT
కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. సంబంధిత వ్యక్తుల స్పందన ఏమిటన్నది ఆసక్తికరం. తాజాగా ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ బ్యాచ్ రియాక్షన్ ఎలా ఉందన్న ఆసక్తి ఒకటైతే.. జగన్ పత్రికలో..సదరు ఇష్యూ గురించి ఏం చెబుతారన్న ఆసక్తి నెలకొంది. ఏపీలోని జగన్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. ఒక ఎమ్మెల్సీ ఏపీ అధికారపక్షంలో చేరిన ఉదంతంపై ఏం రాస్తారు? ఈ ఉదంతంపై ఏం చెప్పుకుంటారు? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిందేమీ లేదన్నట్లుగా జగన్ పత్రిక తేల్చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు సంతబేరం పెట్టేశారని.. ఎమ్మెల్యేల్ని కొనేసేందుకు విపరీతంగా ప్రయత్నించినా చివరకు నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన పార్టీలోకి వెళ్లినట్లుగా తేల్చింది. అంతేకాదు.. పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా ఇద్దరికి మంత్రి పదవులు.. ఒకరికి కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే సమయంలో.. తాజా చేరికలతో ఏపీ అధికారపక్షంలో అసంతృప్తి భగ్గుమందని తేల్చింది.

జగన్ పత్రిక చేసిన వ్యాఖ్యానం జగన్ మైండ్ సెట్ ను చెప్పకనే చెప్పేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పార్టీకి చెందిన జంప్ అయిన ఎమ్మెల్యేలకు సంబంధించి జగన్ పత్రిక ఇచ్చిన వార్తను చూసినప్పుడు.. అక్కసుతో పాటు.. నలుగురు వెళ్లిపోవటం తమకేం పెద్ద విషయం కాదన్నట్లుగా తేల్చింది. నెలల కొద్దీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి విపక్ష ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవటానికి ఏపీ అధికారపక్షం కిందామీదా పడిందని.. ఇంతా చేస్తే నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వారి ఆఫర్లకు తలొగ్గినట్లుగా తేల్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన పార్టీ నేతలు సైకిల్ ఎక్కేసే ఉదంతం గురించి చెబుతూ.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నించి.. ఆడియో.. వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు.. తాజా ఉదంతంలో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేశారని పేర్కొంది. అంటే.. తెలంగాణ అధికారపక్ష అధినేత ప్లానింగ్ తో పోలిస్తే.. జగన్ ప్లానింగ్ ఏమాత్రం బాగోలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లా..? అంటే.. జగన్ పత్రికలో జగన్ ను వేలెత్తి చూపేలా రాసేసినట్లేనా..?
Tags:    

Similar News