ఆర్నెల్ల‌ల్లో అంతా మారిపోయింది

Update: 2018-04-13 15:30 GMT
కాలం ఎప్పుడూ నిజాయితీగా క‌ష్ట‌ప‌డే వారి వెంటే ఉంటుంద‌ని చెబుతారు. తాజాగా ఏపీ రాజకీయాలు చూస్తే ఇది నిజ‌మ‌నిపించ‌క‌మాన‌దు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిజాయితీగా పని చేస్తూ.. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధిగ‌మించేందుకు ఏం చేయాల‌న్న అంశంపై ఆరు నెల‌ల క్రితం ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌ను షురూ చేశారు.

ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. రాష్ట్ర ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని.. బాబు పాల‌న లోపాల్ని గుర్తించ‌ట‌మే కాదు.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా.. అధికార‌ప‌క్ష ఎదురుదాడిని ఎదుర్కొంటూ ఒంట‌రిగా చేస్తున్న పాద‌యాత్ర జ‌గ‌న్ ను రాజ‌కీయంగా మ‌రింత రాటుదేలేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

నిజానికి పాద‌యాత్ర స్టార్ట్ చేసిన‌ప్పుడు పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితులు అంత బాగోలేదు. స్వార్థ రాజ‌కీయాల‌తో పాటు.. ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ మారేందుకు ఏపీ అధికార‌ప‌క్ష అధినేత వేస్తున్న ఎత్తుల‌తో జ‌గ‌న్ పెద్ద ప‌రీక్ష‌ల్నే ఎదుర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ వారి ఒత్తిడికి ఏ మాత్రం త‌ల‌వంచ‌ని ఆయ‌న‌.. ప్ర‌జ‌ల్ని న‌మ్ముకొని.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్లారు.

జ‌గ‌న్ క‌ష్టాన్ని ఏపీ ప్ర‌జ‌లు గుర్తించ‌ట‌మే కాదు.. ఏపీకి భ‌విష్య‌త్ కు కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా మీద జ‌గ‌న్ క‌మిట్ మెంట్ ను ఏపీ ప్ర‌జ‌లు గుర్తించార‌ని చెప్పాలి. హోదా సాధ‌న అంశంలో మొద‌ట్నించి ఒకే స్టాండ్ మీద నిలిచి.. హోదా సాధ‌న‌తోనే ఏపీ రూపురేఖ‌లు మార‌తాయ‌ని జ‌గ‌న్ న‌మ్మారు.

దీనికి త‌గ్గ‌ట్లే ప‌లు ర‌కాలుగా ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు తెలియ‌జేసిన ఆయ‌న‌.. సుదీర్ఘ పాద‌యాత్ర‌లో తానేం చేస్తాన‌న్న విష‌యాన్ని సూటిగా.. స్ప‌ష్టంగా చెబుతున్నారు. జ‌గ‌న్ ప‌డుతున్న‌క‌ష్టానికి త‌గ్గ‌ట్లే ఫ‌లితాలు షురూ అయ్యాయ‌ని చెప్పాలి. తెలంగాణ‌లో మాదిరి కాకుండా ఏపీలో బ‌ల‌మైన విప‌క్షంగా జ‌గ‌న్ పార్టీ అవ‌త‌రించ‌ట‌మే కాదు.. అధినేత మొద‌లు కార్య‌క‌ర్త వ‌ర‌కూ అంద‌రూ స‌మ‌రోత్సాహంతో ఉండేలా చేయ‌టంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు.

తాజాగా హోదా సాధ‌న కోసం ఎంపీల చేత చేయించిన దీక్ష‌తో పాటు.. రాజీనామాల నిర్ణ‌యం ఏపీ అధికార‌ప‌క్షాన్ని ఇరుకున ప‌డేసింద‌ని చెప్పాలి.. జ‌గ‌న్ ప‌డుతున్న క‌ష్టం.. చేస్తున్న ప‌రిశ్ర‌మ పార్టీకి ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆరు నెల‌ల క్రితం పార్టీ ప‌రిస్థితికి.. ఇప్ప‌టికి చాలానే మార్పు వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News