కేంద్ర భద్రత వెనుక అసలు కారణం ఇదేనా ?

Update: 2021-05-12 17:30 GMT
పశ్చిమబెంగాల్ ఎన్నికలో బీజేపీ తరపున గెలిచిన 77 మంది ఎంఎల్ఏలకు కేంద్ర బలగాలతో భద్రతను కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. 66 మంది ఎంఎల్ఏలకు ఎక్స్ క్యాటగిరి, మరో 10 మంది ఎంఎల్ఏలకు వై క్యాటగిరి కల్పించినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారికి ఇప్పటికే జడ్ క్యాటగిరి ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కొన్నిచోట్ల బాగా అల్లర్లు జరిగాయి. దాంతో అల్లర్లకు మీరే కారణం అంటే కాదు మీరే కారణమని బీజేపీ-తృణమూల్ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సరే వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా బీజేపీ ఎంఎల్ఏలందరికీ ముందుజాగ్రత్తగా కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలైతే వచ్చేశాయి.

అల్లర్ల నేపధ్యంలో రాష్ట్ర బలాగల భద్రతపై బీజేపీ ఎంఎల్ఏలకు నమ్మకం లేక కేంద్ర బలగాలను ఎంఎల్ఏలే కోరారేమో అని అందరు అనుకున్నారు. కానీ కేంద్రహోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా బయటపడింది. తనంతట తానుగా కేంద్ర హోంశాఖ ఇలాంటి అసాధారణమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది ? ఎందుకంటే ఎంఎల్ఏలు చేజారిపోకుండానట.

అవును రాష్ట్రంలో మూడోసారి సీఎం అయిన మమతాబెనర్జీని కాదని ఏ ఎంఎల్ఏకూడా ఏమీ చేయలని పరిస్ధితి. పైగా బీజేపీ ఎంఎల్ఏల్లో చాలామందికి సుబేందు అధికారితో ఏమాత్రం పడదట. అందుకనే సుబేందు నేతృత్వంలో పనిచేయటం ఇష్టంలేక చాలామంది ఎంఎల్ఏలు బీజేపీని వదిలేయటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకవేళ ఇదే జరిగితే నరేంద్రమోడి, అమిత్ షా పరువు సాంతం పోయినట్లే.

అందుకనే తమ ఎంఎల్ఏలకు కాపలాట కేంద్ర బలగాలను పెడితే వాళ్ళ ప్రతి మూమెంట్ కేంద్ర హోంశాఖకు తెలిస్తుందని భావించారట. ఈ కారణంగా తమ ఎంఎల్ఏలు పార్టీ నుండి జారిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు టీఎంసీ నేత కకోలీ ఘోష్ దస్తిదార్ చెప్పారు.  తమ ఎంఎల్ఏలు చేజారిపోతారేమోనని బీజేపీ అగ్రనేతల్లో టెన్షన్ మొదలైందని దస్తిదార్ తెలిపారు. మొత్తానికి ఎంఎల్ఏల విషయంలో ఏమో జరుగుతుందనే ఆసక్తి పెరిగిపోతోంది.
Tags:    

Similar News