ముప్పయ్యేళ్ళ తరువాత బాబు మళ్ళీ....అధికారులు అలర్ట్

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సుని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు.;

Update: 2025-12-18 00:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సుని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో ప్రతీ అంశాన్ని ముఖ్యమంత్రి లోతైన సమీక్షతో అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. లోపాలు లోటు పాట్ల మీద వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి ప్రధానంగా పరిపాలనకు కేంద్ర బిందువు అయిన బ్యూరోక్రసీ ని మరింత సమర్ధంగా పనిచేయించాలని చూస్తున్నారు. పాలనా పగ్గాలు ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి చేతులలో ఉన్నా ప్రతీ కార్యక్రమం గ్రౌండ్ లెవెల్ లో అమలు చేయాల్సిన కర్తవ్యం మాత్రం బ్యూరోక్రసీదే. అందుకే చంద్రబాబు కలెక్టర్ల సదస్సుని ప్రతీ మూడు నెలలకు నిర్వహిస్తూ వారికి అన్ని విధాలుగా అలర్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

మళ్ళీ ఆకస్మిక తనిఖీలు :

ఇక కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తాను కొత్త ఏడాది జనవరి నుంచి జిల్లాలలో పర్యటిస్తాను అని ఆయన చెప్పారు. ఆకస్మిక తనిఖీలు చేపడతాను అని కూడా స్పష్టం చేశారు. ప్రధానంగా సంక్షేమ పధకాల అమలు వాటి విధానంలో గ్రౌండ్ లెవెల్ లో సాగుతున్న పనితీరు ఇత్యాది విషయాల మీద తాను పూర్తిగా అధ్యయనం చేస్తాను అని బాబు చెప్పారు. అంతే కాకుండా ఆయా జిల్లాలలో సమస్యలను నేరుగా తెలుసుకుంటాను అని వాటికి తగిన పరిష్కార మార్గాలు వెతుకుతాను అని కూడా బాబు చెబుతున్నారు.

సరిగ్గా మూడు దశాబ్దాలు :

చంద్రబాబు 45 ఏళ్ళ వయసులో ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు, ఆయన అప్పట్లో అంటే 1995 ప్రాంతంలో ఇలాగే ఆకస్మిక తనిఖీలు చేపట్టి మొత్తం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. బాబు ఎక్కడికి వస్తున్నారో ఏ విభాగాన్ని తనిఖీ చేస్తారో చివరి నిముషం వరకూ తెలియకుండా సస్పెన్స్ లో ఉంచేవారు. అలా బాబు వెళ్ళిన చోట్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులను పిలిచి మరీ వాటిని సరి చేసుకోమని చెప్పేవారు. దాంతో ఆకస్మిక తనిఖీల ట్రెండ్ అన్నది బాబు క్రియేట్ చేసినదే. బాబు పేరు చెబితే అదే అందరికీ గుర్తుకు వస్తుంది. ఒక విధంగా పరిపాలన గాడిలో పెట్టడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత నాలుగవ సారి సీఎం అయిన నేపధ్యంలో బాబు ఆకస్మిక తనిఖీలు అంటున్నారు. దాంతో అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అవుతుంది అని అంటున్నారు.

ప్రజా ఫిర్యాదుల మీద :

ఇక ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల విషయంలో కలెక్టర్లు వేగవంతంగా పరిష్కారం అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బాబు దిశా నిర్దేశం చేశారు. ప్రజా ఫిర్యాదులను ఆర్ధిక ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరితగతిన పరిష్కరించండని ఆయన కోరారు. అంతే కాదు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలని సీఎం ఆకనక్షించారు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీకి వస్తానని అందువల్ల అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పడం విశేషం. జీరో టాలరెన్సు విధానంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాల్సిందేనని బాబు నొక్కి చెప్పారు.

పాలనకు ప్రమాణం :

ఎక్కడైనా గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్టే అని బాబు కలెక్టర్లకు వివరించారు. ఆయా విభాగాల వారీగా గ్రీవెన్సులపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తామని కూడా ఆయన చెప్పారు. అంతే కాదు పట్టణాలు గ్రామాలలో మురుగు కాలువలను శుభ్రపరచేందుకు సమర్ధవంతమైన కార్యాచరణ చేపట్టాలని బాబు కోరారు. అలాగే మూడు నెలల వ్యవధిలోగా నగరాలు, పట్టణాలలో మురుగు కాలువలు శుభ్రపరచాలని ఆయన డెడ్ లైన్ విధించడం విశేషం. ఇక రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా తక్షణం జలవనరుల శాఖ పరిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అదే విధంగా నీటి భద్రత గురించి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండకూడదని పేర్కొనడం విశేషం. ఇక వచ్చే త్రైమాసికం నాటికి అన్ని చోట్లా జీరో గ్రీవెన్సులు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ల సదస్సుకు బాబు సూచించారు.

Tags:    

Similar News