రాహుల్ లో పరిణతి.. ఇక ‘పప్పు’ కానేకాదు

Update: 2021-03-29 06:50 GMT
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలనే వారి ఓటమికి కారణమవుతున్నాయని.. బలహీనులైన ప్రత్యర్థులను బలంగా మార్చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఐదారేళ్ల క్రితం వరకూ పప్పు అని బీజేపీ నేతలు అవమానించిన రాహుల్ గాంధీనే ఇప్పుడు ప్రజా సమస్యలపై నిలదీస్తున్న తీరు చూస్తే అతడు నిప్పుగా మారుతున్నాడని అర్థమవుతోందంటున్నారు.

గడిచిన కొంతకాలంగా తన మాటలతో, చేతలతో రాహుల్ గాంధీ తన ఇన్ ఇమేజ్ ను తానే మార్చుకున్నారని చెప్పొచ్చు. కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ చూపిన పరిణితి, టాలెంట్ తో ఆయనపై ఉన్న ఇమేజ్ మారిపోతోంది.

గతంలో మాదిరిగా కాకుండా రాహుల్ మాటల్లో చురుకుదనం పెరిగింది. ప్రత్యర్థుల మీద ఘాటు పంచులు వేస్తున్నారు. మాటల్లో, చేతల్లో రాహుల్ లో మార్పులు వచ్చాయని చెప్పకతప్పదు.

తాజాగా సేలంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ తన ప్రత్యర్థులైన బీజేపీ నేతలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అమిత్ షా, మోహన్ భగవత్ లాంటి వ్యక్తుల కాళ్లు తాకడానికి ఏ తమిళుడూ ఇష్టపడడని.. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం వారి ముందు మోకరిల్లాల్సి వస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజల చేత చప్పట్లు కొట్టించాయి. ఫళని స్వామికి ఇష్టం లేకున్నా.. మోడీషాల ముందు సాగిలపడడానికి కారణం ఆయన చేసిన అవినీతియేనని రాహుల్ ఆరోపించారు.

తమిళనాడు కాబోయే సీఎం స్టాలిన్ అని తాను గ్యారెంటీ ఇస్తున్నట్లు చెప్పారు. సంఘ్-బీజేపీ వద్ద అపరిమిత డబ్బు ఉందని.. అందుకే జాగ్రత్తగా ఉండాలన్నారు. తొలుత బీజేపీని తమిళనాడు నుంచి తరిమికొడుదామని.. తర్వాత ఢిల్లీ నుంచి పంపించేద్దామని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజకీయ పరిణతి చూశాక ఆయనను పప్పు అని ఇక అనాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News