రైతుల ఉద్యమం అంటే మరీ ఇంత చులకనా ?

Update: 2021-01-14 11:22 GMT
గడచిన 50 రోజులుగా మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతలపై బీజేపీ ఎంపి హేమమాలిని చాలా చులకనగా మాట్లాడారు. తామెందుకు ఉద్యమం చేస్తున్నారో రైతులకే తెలీదంటూ ఉద్యమాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఏముందో అసలు రైతులకు తెలుసా ? అని నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ వద్ద ఉద్యమం మొదలైన ఇన్ని రోజులుగా హేమమాలిని నోరిప్పటమే విచిత్రంగా ఉంది.

తామకు ఏమి కావాలో తెలీకుండానే ఇన్ని రోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని హేమమాలిని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. రైతుల సంగతి పక్కనపెట్టేస్తే నూతన వ్యవసాయ చట్టంలో ఏముందో హేమమాలినికి తెలుసా ? అన్న ప్రశ్న మొదలైంది. కేంద్రమంత్రులతో ఎనిమిదిసార్లు చర్చజరిపినా తమకు ఏమి కావాలనే విషయంలో రైతులకే క్లారిటి లేదని ఈ సినీనటి కమ్ మధుర ఎంపి వ్యాఖ్యలు చేయటమే విడ్డూరంగా ఉంది.

నిజానికి హేమమాలిని రాజకీయాల్లోకి వచ్చి, ఎంపిగా గెలిచిన తర్వాత ప్రజా సమస్యలపై పెద్దగా మాట్లాడింది కూడా ఏమీలేదు. ఏదో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ప్రజాసమస్యలపై పోరాటాలూ చేయలేదు. సీరియల్స్ చేసుకోవటం, సినిమాలు, ప్రకటనల్లో బిజీగా ఉండటంతోనే ఈమెకు టైం సరిపోతోంది. అలాంటిది ఒక్కసారిగా రైతుల ఉద్యమం గురించి నోటికొచ్చింది మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది.

 పైగా రైతులు చేస్తున్న ఉద్యమం స్వచ్చమైనది కాదని కూడా పెద్ద మాటలు మాట్లాడేశారు. రైతుల వెనుక ఎవరో ఉండి ఉద్యమం చేయిస్తున్నట్లు ఆరోపణలు చేయటమంటే నిజంగా రైతులను అవమానించటమే. ఏ ఉద్యమం అయినా ఎక్కడో మొదలవుతుంది. తర్వాత అనేక రూపాలు సంతరించుకుని చివరకు రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం లేకపోలేదు. అంతమాత్రాన ఇపుడు రైతులు చేస్తున్న ఉద్యమం స్వచ్చమైనది కాదని అనటమంటే రైతుసంఘాల నేతలను రెచ్చగొట్టడం కాక మరేమిటి ?
Tags:    

Similar News