కొవిడ్ నుంచి భారత్ బయటపడిందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Update: 2021-11-18 02:30 GMT
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించింది. అగ్రరాజ్యం, చిన్న దేశం తేడా లేకుండా విశ్వరూపం చూపించింది. దశలవారిగీ కోరలు చాస్తూ ఎంతో మందిని పొట్టనబెట్టుకుంది. అయితే కొన్ని దేశాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటే... మరికొన్ని దేశాల్లో మాత్రం కాస్త తక్కువగా ఉది. కొవిడ్ నుంచి కొన్ని దేశాలు అతి తక్కువ సమయంలో బయటపడగలిగాయి. కానీ నేటికి ఈ మహమ్మారి కొన్ని దేశాల్లో విజృంభిస్తూనే ఉంది. మన దేశంలోనూ రెండు దశలుగా వ్యాపించింది. అంతేకాకుండా మొదటి దశతో పోల్చితే రెండో దశలో తీవ్ర ప్రభావం చూపింది. ఇకపోతే ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు సెకండ్ వేవ్ ప్రభావం చూపింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. అక్టోబర్ లో థర్డ్ వేవ్ ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. కానీ ఇప్పటి వరకు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. మరి ప్రస్తుతం మనదేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంది? కొవిడ్ నుంచి భారత్ బయటపడిందా? అనేది చాలా మందికి సందేహాలు కలిగిస్తోంది.

సెకండ్ అనంతరం జూన్ చివరి వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇకపోతే జూన్ 27వ తేదీ నుంచి పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే మనదేశంలో కరోనా మహమ్మారి దశ నుంచి సాధారణ వ్యాధిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లోని గత 140 రోజుల పరిస్థితిపై వైద్యులు టి.జాకబ్ జాన్, డాక్టర్ ఎంస్ శేషాద్రి పరిశీలించారు. కరోనా సాధారణ వ్యాధిగా మారిందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంటే మనకు ఇప్పుడు వచ్చే జలుబు, సాధారణ జ్వరం లాగే కరోనా సోకితే కలిగే అనారోగ్యం ఉంటుందని వైద్యులు తేల్చారు. వైరస్ తో పెద్దగా ప్రాణ భయం ఉండబోదని వారు స్పష్టం చేశారు. మొదటి వేవ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా కూడా... సెకండ్ వేవ్ లో అది ఉద్ధృతమైంది. ఇకపోతే థర్డ్ వేవ్ మరింత ప్రభావం చూపుతుందని... అదికూడా పిల్లలపై ఉంటుందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అలాంటిది ఉండబోదని వైద్యుల బృందం స్పష్టం చేసింది.

రెండో దశలో వ్యాపించిన డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపింది. ఆ వేరియంట్ చాలా ప్రమాదకరం అని పరిశోధనల్లో తేలింది. అయితే మరో కొత్త వేరియంట్ AY.4.2 అంత ప్రమాదకరం కాదని వైద్యులు తెలిపారు. ఈ వేరియంట్ కు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయని వారు తేల్చారు. అందుకే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూనే ఉందని చెప్పారు. ఈ వేరియంట్ తో పాజిటివ్ కేసులు పెద్దగా పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. అందుకే భారత్ ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా వైరస్ మహమ్మారి నుంచి సాధారణ స్థితికి చేరుకున్న దేశాల్లో భారత్ మొదటిది అని వారు వెల్లడించారు. మనదేశం కోరనా నుంచి చాలా వేగంగా కోలుకుంటోందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అర్బన్, రూరల్ ఏరియాల్లో సమాంతరంగా టీకా పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా మహమ్మారి నుంచి విముక్తికి ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక అరవై ఏళ్లు పైబడిన వారు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇకపోతే వివిధ దేశాల మధ్య ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేశారు. విదేశీ ప్రయాణాలకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక ప్రస్తుతానికి కరోనా నుంచి భారత్ సేఫ్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News