అరెస్ట్ 'భయం' అంటే ఏంటో తెలిసి వచ్చిందా ?

Update: 2023-03-17 10:04 GMT
అందరిలోను ఇపుడీ అనుమానమే పెరిగిపోతోంది. గురువారం ఢిల్లీలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావాల్సిన కల్వకుంట్ల కవిత డుమ్మాకొట్టారు. తాను మహిళనని తనకు ప్రత్యేకహక్కులున్నాయి కాబట్టి ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యేది లేదని విచిత్రమైన వాదన లేవదీశారు. తాను మహిళనని, ప్రత్యేక హక్కులున్నాయన్నదే నిజమైతే మరి ఈనెల 11వ తేదీన జరిగిన విచారణకు  ఎందుకు హాజరయ్యారు ? అప్పుడు తన ప్రత్యేకహక్కులు గుర్తుకురాలేదా ? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే రెండోసారి విచారణలో అరెస్టు చేస్తారని కవిత భయపడినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఈడీ విచారణను తప్పించుకునేందుకు  కవిత వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రింకోర్టులో కేసుల మీద కేసులేస్తున్నారు. ఈడీ విచారణకు హాజరుకాలేనని వేసిన కేసును ఈనెల 24వ తేదీన విచారించబోతున్నట్లు సుప్రింకోర్టు చెప్పింది. అయితే 20వ తేదీన విచారణకు రావాలన్న ఈడీ నోటీసును కవిత తాజాగా కోర్టులో మళ్ళీ సవాలు చేశారు. అయితే మహిళలను విచారించాలంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి విచారించాలనేది రెగ్యులర్ గా ఉండే సీఆర్పీసీ చట్టంలో మాత్రమే సాధ్యమని తెలుస్తోంది.

కవిత మీద పెట్టింది మనీ ల్యాండరింగ్ ప్రివెన్షన్ యాక్ట్ (ఎంపీఎల్ఏ). ఈ చట్టంలో మహిళలకు ప్రత్యేక మినహాయింపులంటు ఏమీలేవు. ఈ విషయాలు కవితకు న్యాయవాదులు కచ్చితంగా చెప్పేఉంటారు. అయినా సరే ఈడీ విచారణను తప్పించుకునేందుకు కవిత న్యాయపోరాటం చేస్తున్నారు. మరి ఈ పోరాటంలో కవిత విజయంసాధిస్తారా అన్నది అనుమానమే అంటున్నారు నిపుణులు.
 
ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర చాలా కీలకమని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో చాలాసార్లు కోర్టుకు చెప్పింది. స్కామ్ లోని  సౌత్ గ్రూపు తరపున కవితే సూత్రదారుగా ఈడీ అనేక వివరాలను కోర్టుకు అందించిందట. కాబట్టి కేసులో నుండి ముఖ్యంగా ఈడీ విచారణ నుండి కవిత తప్పించుకునే అవకాశాలు లేవనే అనిపిస్తోంది. మొదటిసారి విచారణకు హాజరైన కవిత రెండో విచారణను తప్పించుకోవాలని చూస్తున్నారంటే అరెస్టు భయంతోనే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News