బీజేపీ పతనం ప్రారంభమైందా?

Update: 2019-11-29 04:48 GMT
బీజేపీ ప్రభ మసకబారుతోంది. ఒక్కో రాష్ట్రం ఆ పార్టీ చేజారుతోంది. ఆరేళ్ల క్రితం 2014లో మోడీ వేవ్ తో పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు బలమైన కాంగ్రెస్ ను ఢీకొట్టి నిలదొక్కుకుంది. 2014లో మోడీ గద్దెనెక్కినప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం ఐదు మాత్రమే.

మోడీ గద్దెనెక్కాక ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదంతో ముందుకెళ్లారు.  జాతీయవాదం, భావోద్వేగాలు రెచ్చగొడుతూ రాష్ట్రాలను గెలిచేశారు కమలనాథులు. మరికొన్ని చోట్ల అవకాశం లేకున్నా ఎమ్మెల్యేలను లాగేసి ఆయా రాష్ట్రాలను హస్తగతం చేసుకున్నారు.

2017 నాటికి దేశంలోని 71శాతం రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రభుత్వాలు కొనసాగాయి. అయితే 2018 చివరలో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల నుంచి కమలనాథులకు ఊహించని షాక్ తగిలింది.ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి బీజేపీ పతనం ప్రారంభమైంది.. ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూనే ఉంది.

2019 నవంబర్ నెల వరకూ చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పుడు కేవలం 40శాతం రాష్ట్రాలకే బీజేపీ పరిమితమైంది. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్,  ఒడిషాలో బిజూ జనతాదళ్, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ, తమిళనాడులో అన్నాడీఎకే, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారంలో ఉన్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నా.. దేశంలోని కీలక పెద్ద రాష్ట్రాలు మాత్రం బీజేపీ చేజారుతున్నాయి.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రామైన ఉత్తరప్రదేశ్ లో 2017 ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది బీజేపీ. ఇక బీహార్ లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. ఇక మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ ఇవ్వలేదు. హర్యానాలో జేజేపీ అండతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మహారాష్ట్రలో బీజేపీకి ఓటర్లు షాకిచ్చారు. మెజార్టీ సీట్లు కట్టబెట్టలేదు. దీంతో బీజేపీకి శివసేన హ్యాండిచ్చింది.కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి  పొత్తుతో అధికారం చేపట్టింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి అఖండ మెజార్టీ సాధించిన కేవలం ఐదు నెలల కాలంలోనే జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు  బీజేపీకి ఊహించని షాక్ ను ఇచ్చాయి.

ఇక కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. 17మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపచేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న 15 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ 8 స్తానాలను గెలుచుకోకపోతే యడ్యూరప్ప సర్కారు పడిపోతుంది. దీంతో బీజేపీ కర్ణాటకలో కూడా అధికారం కోల్పోవడం ఖాయం.

*బీజేపీ ఓటమికి కారణాలివే..

ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానంగా మోడీ, అమిత్ షాతోపాటు బీజేపీ పరివారమంతా జాతీయ వాదం, దేశభద్రత వంటి అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రచారం చేసింది. కానీ ప్రజలు మాత్రం జాతీయవాదం కంటే స్థానిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. స్థానిక సమస్యలను మరిచిన  బీజేపీకి కర్రుకాల్చి వాత పెడుతున్నారు.  దేశానికి నాయకత్వం విషయంలో రాహుల్ కంటే మోడీ బెటర్ అని ఓటేసి గెలిపిస్తుండగా.. రాష్ట్రాల్లో మాత్రం స్థానిక సమస్యలు - సరైన పార్టీ - నేతలనే ప్రజలు ఎంచుకుంటున్నారు. కేంద్రంలో కూడా సరైన  పోటీ ఉంటే మోడీకి షాక్ ఇవ్వగలరని రాష్ట్రాల ఫలితాలను బట్టి తెలుస్తోంది.దీన్ని రాహుల్ స్థానంలో బలమైన ప్రతిపక్ష నేత ఉంటే మోడీ మేజిక్ పనిచేయదని అర్థమవుతోంది.


Tags:    

Similar News