ఇంటర్‌ పోల్ బాస్ కిడ్నాప్?

Update: 2018-10-06 06:53 GMT
ఇంటర్‌ పోల్ అంటే ప్రపంచదేశాల్లోని క్రిమినల్స్‌ కు దడ పుడుతుంది. కానీ, అలాంటి ఇంటర్‌ పోల్ బాస్ కొద్దిరోజులుగా కనిపించకపోవడం ప్రపంచాన్ని షాక్‌ కు గురిచేస్తోంది. అవును... ఇంటర్‌ నేషనల్‌ క్రిమినల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్‌ (ఇంటర్‌ పోల్‌) అధ్యక్షుడు మెంగ్‌ హాంగ్వేస్‌ కనిపించకుండాపోయారు. గతనెలాఖరులో సొంత దేశం చైనా వెళ్తున్నానని చెప్పిన మెంగ్‌ ఆచూకీ ఇంతవరకు లభించలేదని ఆయన భార్య పాలిస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్రాన్స్‌ లోని లియనాలోని ఇంటర్‌ పోల్‌ కార్యాలయం నుంచి చైనా వెళ్తున్నట్లు చెప్పిన మెంగ్‌ హాంగ్వే చైనా వెళ్లినట్లు కూడా సమాచారం అందలేదని ఆయన భార్య వాపోయింది.
   
అంతర్జాతీయ నేరగాళ్ల ఆట కట్టించడంలో కీలకంగా వ్యవహరించే ఇంటర్‌ పోల్‌ అధ్యక్షుడి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మెంగ్‌ ను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైనా మాజీ సెక్యూరిటీ ఆఫీసర్‌ అయిన మెంగ్‌ నవంబర్‌ 2016లో ఇంటర్‌ పోల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి ఇంటర్‌ పోల్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేంత వరకు మెంగ్‌.. చైనా నేషనల్‌ పోలీస్‌ ఫోర్స్‌ లో వైస్‌ మినిస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సెక్యురిటీ అధికారిగా పనిచేశారు. కోస్ట్‌ గార్డు బ్రాంచ్‌ల్లోనూ డిప్యూటీ హెడ్‌ గా సేవలు అందించారు.
   
మెంగ్‌ కనిపించకుండా పోయిన వార్త వారంరోజుల క్రితమే తెలిసినా చైనా విదేశాంగ - ప్రజా భధ్రత మంత్రిత్వ శాఖలు వెంటనే స్పందించలేవు. చైనా మాజీ నాయకులతో మెంగ్‌ సత్సంబంధాలు కలిగిఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ అవినీతి ఆరోపణలతో తొలగించిన నాయకులతోనూ మెంగ్‌ సత్సబంధాలు కొనసాగించారు. అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉండి జీవిత ఖైదు  అనుభవిస్తున్న చైనా సెక్యూరిటీ చీఫ్‌ జౌయాంగ్‌కాంగ్‌తో కూడా మెంగ్‌ కు సంబంధాలున్నాయి. మెంగ్‌ మిస్సింగ్‌ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనుక చైనా హస్తం ఉందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News