రాహుల్ నోరు నొక్కుతున్నారా...ఫ్లాష్ బ్యాక్ ఏమి చెబుతోంది ?

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ విషయం ఎన్నో సార్లు గొప్పగా అంతా చెప్పుకుంటారు. అలాంటిది ఈ దేశానికి అత్యున్నత చట్ట సభల వేదికల మీద జరుగుతున్నదేమిటి అన్న చర్చ అయితే సాగుతోంది.;

Update: 2026-02-05 08:30 GMT

భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ విషయం ఎన్నో సార్లు గొప్పగా అంతా చెప్పుకుంటారు. అలాంటిది ఈ దేశానికి అత్యున్నత చట్ట సభల వేదికల మీద జరుగుతున్నదేమిటి అన్న చర్చ అయితే సాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ఎందుకు వరసబెట్టి వాయిదా పడుతున్నాయి, ఎందుకు సజావుగా సాగడం లేదు, దానికి కారణాలు ఏమిటి ప్రతిష్టంబనకు గల పరిస్థితులు ఏమిటి ఇది సాగుతున్న చర్చ. పార్లమెంట్ లో చూసుకుంటే బలమైన అధికార పక్షంగా ఎన్డీయే ఉంది. మిత్రులు తటస్థుల మద్దతుతో కలుపుకుని మూడు వందల మంది ఎంపీల బలం ఎన్డీయేకు ఉంది. పైగా గత మూడు దఫాలుగా అధికారంలో ఎన్డీయే ఉంది.

రాహుల్ అపొజిషన్ :

ఒక విపక్షం వైపు చూస్తే వంద మార్క్ కి చేరువలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రాహుల్ గాంధీ తొలిసారి తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో కేబినెట్ ర్యాంక్ హోదాతో అధికార ప్రోటోకాల్ తో ఉన్నారు. 2024 లో ఆయనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ దక్కింది. పార్లమెంటరీ సంప్రదాయాలను బట్టి చూస్తే ప్రధాని తరువాత ఎంతో ప్రాధాన్యత లీడర్ ఆఫ్ అపొజిషన్ కి ఉంది. రాహుల్ గాంధీ ఏ ప్రశ్నను అయినా సంధించవచ్చు. అయితే నిబంధనలు విరుద్ధంగా ఉంటే నో చెప్పవచ్చు. కానీ ఆయన మాట్లాడకుండా అడ్డుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నదే చర్చగా ఉంది.

ఆ పుస్తకంలో ఏముంది :

రాహుల్ గాంధీ సభలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని కొన్ని లైన్లు సభలో చదవాలని ప్రయత్నించారు. అయితే ఆ పుస్తకం ప్రచురణ కాలేదని అందువల్ల ఆ పుస్తకం లోని అంశాల గురించి రూల్స్ ప్రకారం సభలో ప్రస్తావించ వద్దంటూ అధికార పక్షం అడ్డుకుంది. నిజానికి ఈ పుస్తకంలో ఉన్నది ఏమిటి అంటే చైనా దళాలు భారత్ భూభాగంలోకి దాడికి వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలం అయింది అన్నది రాహుల్ చెప్పదలచుకున్నారు. దాంతో రూల్స్ ప్రస్తావన తేవడంతో రాహుల్ చెప్పాలనుకున్నది సభలో చెప్పలేకపోయారు. అయితే ఇదే సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కొన్ని పుస్తకాలను తీసుకుని వచ్చి నెహ్రూ మీద విమర్శలు సంధించారు. మరి ఆ పుస్తకాలకు అనుమతి ఇచ్చినపుడు రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడనివ్వరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.

పంతాలకు పోతున్నారా :

ఇక రాహుల్ గాంధీ తాను ఏ పుస్తకాలను ప్రస్తావించనని భారత్ చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు పరిస్థితుల గురించి జాతీయ భద్రత అంశంగా మాట్లాడుతాను అని చెప్పినా కూడా అనుమతించకపోవడం పట్ల చర్చ సాగుతోంది. నిజానికి ప్రతిపక్షం ఏమి చెప్పినా చివరికి మైక్ అధికార పక్షానికి వస్తుంది. విపక్షం చెప్పింది తప్పు అని చెప్పే హక్కు అధికార పక్షానికి ఉంటుంది తమ వాదనా పటిమతో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తిప్పి కొట్టే అవకాశం అడ్వాంటేజ్ అధికార పక్షానికి ఎపుడూ ఉంటాయి. కానీ విపక్షాలు ఏమి చెప్పదలచుకున్నారు అన్నది చెప్పనీయకపోతే ఎలా అన్న ప్రశ్ననే ఇండియా కూటమి నుంచి వ్యక్తం అవుతోంది. సభలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం, అధికార పక్షం వాస్తవాలను ఇవిగో అని చెప్పాల్సి ఉంటుంది. కానీ అసలు మాట్లాడనీయకపోవడమేంటి అన్నదే చర్చగా ఉంది. ఇలా పంతాలకు పట్టింపులకు పోతే సభలో ప్రజా సమస్యలు కానీ కీలక అంశాలు కానీ చర్చకు ఎలా వస్తాయని అంటున్నారు.

గతంలో అలా :

గతంలో తొలి ప్రధాని నెహ్రూ కేవలం ఒకరిద్దరు సభ్యులు కలిగిన జన సంఘ్ కి అంటే ఇప్పటి బీజేపీ పూర్వ రూపం అయిన పార్టీకి ఎన్నో అవకాశాలు మాట్లాడేందుకు ఇచ్చారు తన ప్రభుత్వం మీద అప్పటి యువ నేత అటల్ బిహారీ వాజ్ పేయి విమర్శలు చేస్తూ ఉంటే నెహ్రూ అనుమతించేవారు. ఆయన విమర్శలకు సరైతే సరిదిద్దుకునే వారు. లేకపోతే వివరణ ఇచ్చేవారు. అది కదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన ముఖ్య లక్షణం అన్నది అంతా అంటున్న మాట. విపక్షాలను మాట్లాడనీయవద్దు అనో లేక రూల్స్ చూపించో ఆపితే అంతిమంగా నష్టపోయేది ఎవరు అంటే జవాబు సులువుగానే దొరుకుతుంది. ప్రతిపక్షం అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలుగానే చూడాలి. జవాబు వాటికి చెప్పగలగాలి. అంతే తప్ప అధికార పక్షం వైపే అంతా అన్నట్లుగా వ్యవహారం సాగితే ఎలా అన్నది మేధావుల నుంచి వస్తున్న మాట. అధికార పక్షం ప్రతిపక్షం స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు జరపాలి. ఎవరూ ఎవరికీ శత్రువులు కారని గ్రహించాలి అని సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News