విగ్ర‌హంతో ముదిరిన వివాదం

Update: 2021-08-18 01:30 GMT
2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ పార్టీ అధికారాన్ని ద‌క్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్లా ఆ పార్టీకీ భారీ మెజార్టీ ద‌క్కింది. నెల్లూరు జిల్లాలోనూ ప‌దికి ప‌ది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్ల‌మెంటు స్థానాలు ఆ పార్టీ ఖాతాలోనే చేరాయి. ఇప్పుడు ప్ర‌భుత్వంలో ఉన్న ఆ పార్టీకి బ‌లం ప‌రంగా తిరుగులేదు. పూర్తి ఆధిప‌త్యం ఆ పార్టీదే. కానీ ఇటీవ‌ల నెల్లూరులో అధికార పార్టీలోని రెండు వ‌ర్గాలు మ‌ధ్య ముదురుతోన్న వివాదం పార్టీ ప‌రువును తీస్తుంద‌ని వైసీపీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి. మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ప్ర‌స్తుత మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ మ‌ధ్య కోల్డ్‌వార్ మ‌రోస్థాయికి చేరింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ స‌ర్కారులో రామ‌నారాయ‌ణ‌రెడ్డి మంత్రిగా ప‌నిచేశారు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న్ని కాద‌ని అనిల్ కుమార్‌కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దీంతో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ప్ర‌స్తుతం నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్‌.. ఆనం కుటుంబ అండ‌తోనే రాజ‌కీయ అరంగేట్రం చేశార‌ని అలాంటిది ఇప్పుడు వాళ్ల‌కే ఎదురు తిరుగుతున్నాడ‌ని ఆనం వ‌ర్గం అసంతృప్తితో ఉంది. మ‌రోవైపు త‌న‌కు పెద్ద‌గా సంబంధం లేని వెంట‌క‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి గెలిచారు. కానీ నెల్లూరు సిటీలోనూ ఆనం వ‌ర్గానికి మంచి ప‌ట్టుంది. ఓ ద‌శ‌లో అనిల్ వ‌ర్గంతో గొడ‌వ‌లు ముదిరి నెల్లూరు న‌గ‌రం త‌న‌దే.. ఇక్క‌డ రాజ‌కీయం కూడా త‌న‌దే అని రామ‌నార‌య‌ణ రెడ్డి గ‌ట్టిగా చెప్పే ప‌రిస్థితి కూడా వ‌చ్చింద‌ని స‌మాచారం.

తాజాగా ఓ విగ్ర‌హాన్ని తొల‌గించ‌డం ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదాన్ని మ‌రింత పెద్ద‌దిగా చేసింది. నెల్లూరు ప‌ట్ట‌ణంలో కొత్త‌గా పైవంతెన నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం కోసం మినీ బైపాస్ రోడ్డులో ఉన్న రామ‌నారాయ‌ణ తండ్రి అయిన మాజీ మంత్రి ఆనం వెంక‌టరెడ్డి విగ్ర‌హాన్ని తొల‌గించారు. స‌రిగ్గా పిల్ల‌ర్ అక్క‌డే రావ‌డంతో ఆ విగ్ర‌హాన్ని తీసేశారు. త‌న తండ్రి విగ్ర‌హాన్ని తొల‌గించ‌డాన్ని రామ‌నారాయ‌ణ జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌న‌కు తెలీకుండానే ఆ విగ్ర‌హాన్ని తొల‌గించ‌డం ప‌ట్ల ఆగ్ర‌హంతో ఉన్నారు.

దీంతో వెంక‌ట‌గిరిలో తాను చేప‌ట్టే ఏ అభివృద్ధి ప‌నులకు సంబంధించిన శిలాఫ‌ల‌కాల‌పై మంత్రి అనిల్ పేరు లేకుండా చేశార‌ని స‌మాచారం. ఈ వ్య‌వ‌హారం క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కూ వెళ్లింది. ఆనంకు స‌ర్ది చెప్పాల‌ని ఇన్‌చార్జి మంత్రి బాలినేని కూడా ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. చివ‌ర‌కు కొన్ని చోట్ల అనిల్ పేరును కాగితంపై రాసి శిలాఫ‌ల‌కాల‌పై అతికించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు గ్రావెల్ త‌వ్వ‌కాల విష‌యంలో అధికార పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం వెన‌క జ‌ల‌వ‌న‌రుల శాఖ సిబ్బంది పాత్ర ఉండ‌టంతో ఆ శాఖ మంత్రి అయిన అనిల్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ పంచాయితీ కోసం ఇటీవ‌ల స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నెల్లూరు వ‌చ్చి వెళ్లారు. రెండు వ‌ర్గాల‌తోనూ ఆయ‌న మాట్లాడిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం స‌ద్దుమ‌ణిగిందో? లేదో అనే విష‌యంపై మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాలేదు.


Tags:    

Similar News