టిబెట్ పీఠభూమిలో భారీగా బలగాల మోహరింపు..భారత్ ను రెచ్చగొడుతున్న చైనా !

Update: 2020-09-10 10:50 GMT
 గత కొన్ని రోజులుగా చైనా , భారత్ మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది. భారత్ ఎంతగా సర్దుకుపోవాలి అని చూస్తున్నా కూడా చైనా దుందుడుకు చర్యలు చేపడుతూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట.. దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్‌ ను యుద్ధానికి ప్రేరేపించేలా ప్రవర్తిస్తోంది. సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి భారత్ తనవంతు ప్రయత్నాలను చేస్తుంది. అయితే , దానికి విఘాతం కలిగించేలా చైనా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని బలపరిచేలా.. సరిహద్దుల్లో చైనా తన సైనిక బలగాన్ని మరింత పెంచింది. యుద్ధ సామాగ్రిని తరలించింది. టిబెట్ పీఠభూమిలో చైనా తన సైనిక బలగాలతో పూర్తిగా నింపేసింది. కొత్తగా బాంబర్లను, ఎయిర్ డిఫెన్స్ ట్రూప్, స్పెషల్ ఫోర్స్‌ను టిబెట్ పీఠభూమికి తరలించింది.

భారీగా యుద్ధ సామాగ్రిని తరలించగల శక్తి సామర్థ్యాలు వై-20 ఎయిర్ క్రాఫ్ట్స్ ‌కు ఉన్నాయి. వాటితో పాటు హెచ్ ‌జే-10 యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్‌ ను  ఏర్పాటు చేసింది. పొరుగు దేశాల సరిహద్దుల నుంచి టిబెట్ పీఠభూమికి భారీ ఎత్తున సైన్యాన్ని తరలించడంతో   చైనా యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 71వ గ్రూప్ ఆర్మీని చైనా బరిలోకి దింపింది. హెచ్ ‌జే-10 యుద్ధ ట్యాంకులతో కూడిన ఈ ఆర్మీ గ్రూప్ చైనా ఈశాన్య ప్రాంతంలోని గ్ఝియాన్షు ప్రావిన్స్ నుంచి గోబీ ఎడారి మీదుగా వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి టిబెట్ పీఠభూమికి చేరుకుంది. మరిన్ని బలగాలను తరలిస్తోంది.

టిబెట్ పీఠభూమిలో చైనా తరలిస్తోన్న యుద్ధ సామాగ్రిని చూస్తోంటే.. యుద్ధానికి సమాయాత్తమౌతున్నట్లే కనిపిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. గత నెల 29, 30 తేదీల్లో పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్‌ పాయ్ పర్వతంపై రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ,  తరువాతే  టిబెట్ పీఠభూమిలో చైనా తమ సైనిక బలగాలను పెంచింది.ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తోన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో చైనా కౌంటర్ పార్ట్ వాంగ్ యీ భేటీ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. రెండు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల మధ్య లంచ్ మీటింగ్ ఏర్పాటు కావొచ్చని తెలిపింది. రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీ ఏర్పాటవుతుందని భావిస్తోన్న తరుణంలోనే చైనా తన సైనిక బలగాలను భారీగా తరలించడంతో దీనిపై చర్చ జరుగుతుంది.
Tags:    

Similar News