ఫ్రాన్స్ అబ్బాయి.. ఖమ్మం అమ్మాయి.. రెండు సంప్రదాయాల్లో పెళ్లి!

ప్రేమకు ప్రాంతాలతో పని లేదు కదా.. రెండు మనసులు కలిస్తే చాలు! అలాగే ఫ్రాన్స్ అబ్బాయి, ఖమ్మం అమ్మాయికి మధ్య ప్రేమ చిగురించింది.;

Update: 2026-01-13 09:30 GMT

ప్రేమకు ప్రాంతాలతో పని లేదు కదా.. రెండు మనసులు కలిస్తే చాలు! అలాగే ఫ్రాన్స్ అబ్బాయి, ఖమ్మం అమ్మాయికి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో.. ఈ జంట ఇప్పుడు.. 'కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి.. నిన్న మొన్నా చూస్తే ఇద్దరం.. ఇప్పుడయ్యాం కదా ఒక్కరం' అని పాటలు పాడుకుంటుంది. వీరిద్దరూ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హిందు, క్రైస్తవ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి పిక్ వైరల్ అవుతోంది!

అవును... ఖండాంతరాలు దాటిన ప్రేమ కథ తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఫ్రాన్స్‌ అబ్బాయి, ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మాయి.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ ఎక్కడ కలిశారు.. ఎలా కలిశారు.. ఎప్పుడు కలిశారు.. అంటూ వీరి ప్రేమ కథ గురించిన ఆసక్తి నెలకొంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్...!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురానికి చెందిన వెంకన్న, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరు గ్రామంలో వ్యవసాయం చేస్తుంటారు. వీరి పెద్ద కుమార్తె ప్రశాంతి.. ఖమ్మం జిల్లాలోని గురుకులంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఖమ్మంలోని బీటెక్‌ చదివిన అనంతరం ఎంఎస్‌ చదివేందుకు ఫ్రాన్స్‌ వెళ్లారు. అక్కడ పారిస్‌ నగరానికి చెందిన సహ విద్యార్థి నాతన్‌ క్రిస్టోఫ్‌ జూబర్ట్‌ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

వాస్తవానికి అక్కడ చదువుకుంటున్న సమయంలో తొలుత స్నేహం కుదిరింది.. చదువు ముగిసిన తర్వాత ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగంలో చేరారు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. స్నేహం ప్రేమగా మారి.. పెద్దలను ఒప్పించి.. తాజాగా వివాహ బంధంతో ఒకటయ్యారు.

వరుడికి భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని కోరిక ఉండటంతో వారు ఖమ్మంలో పెద్దల సమక్షంలో గట్టయ్య సెంటర్‌ లోని ఓ మందిరంలో సోమవారం ఒక్కటయ్యారు. భారతీయ సంప్రదాయం అంటే ఇష్టపడే వరుడు కుటుంబ సభ్యులు.. ఇక్కడి వస్త్రధారణతో సందడి చేస్తూ ఉత్సాహంగా గడిపారు. నాతన్‌ వ్యక్తిత్వం చాలా మంచిదని, అందుకే అతడిని ఇష్టపడ్డానని వధువు చెప్పారు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ కథ ఆసక్తిగా మారింది!

Tags:    

Similar News