'స్త్రీ శ‌క్తి' తో మేజ‌ర్ ప్రాబ్లంకు చెక్‌: చంద్ర‌బాబు హ్యాపీ

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో 20 శాతం మేర‌కు రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గాయ‌ని అధికారులు చంద్ర‌బాబుకు వివ‌రించారు. గ‌త ఏడాదితో పోల్చుకుంటే.. ప్ర‌మాదాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అన్నారు.;

Update: 2026-03-03 18:04 GMT

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల‌ను సూప‌ర్ హిట్ చేసింద‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. కేవ‌లం ప‌థ‌కాల‌ను మాత్ర‌మే కాకుండా.. వాటి ద్వారా కీల‌క స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించే అవ‌కాశం ఏర్ప‌డింద‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల‌ని సంబంధిత అధికారుల‌ను చంద్ర‌బాబు ఆదేశించారు.

స్త్రీ శ‌క్తితో చెక్‌!

రాష్ట్రం స‌హా దేశంలో రోడ్డు ప్ర‌మాదాలు ఏటా కొన్ని వేల మంది ప్రాణాల‌ను హ‌రిస్తున్నాయి. ద్విచ‌క్ర‌వాహ‌నాలపై ప్ర‌యాణిస్తున్న వారే.. ఎక్కువ మంది ఈ ప్ర‌మాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. హెల్మెట్లు లేక ఎక్కువ మంది.. హెల్మెట్ ఉండి కూడా కొంద‌రు ర‌హ‌దారి ప్ర‌మాదాల్లో ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. ఏపీలోనూ ఈ ప్ర‌మాదాల‌కు కొద‌వ లేదు. అయితే.. గ‌త ఏడాది ఆగ‌స్టులో స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం ప్రారంభించిన త‌ర్వాత‌.. ర‌హ‌దారి ప్ర‌మాదాలు 20 శాతంమేర‌కు త‌గ్గాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబుకు తాజాగా వారు గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు.

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో 20 శాతం మేర‌కు రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గాయ‌ని అధికారులు చంద్ర‌బాబుకు వివ‌రించారు. గ‌త ఏడాదితో పోల్చుకుంటే.. ప్ర‌మాదాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అన్నారు. దీనికి కార‌ణం స్త్రీ శ‌క్తి ప‌థ‌క‌మేన‌ని వివ‌రించారు. దీంతో సీఎం చంద్రబాబు సంతోషం వ్య‌క్తం చేయ‌డ‌మే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ర‌హ‌దారి ప్ర‌మాదాల‌పై గ‌త ఏడాది.. ప్ర‌స్తుత ఏడాది రిపోర్టులు ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనిపై మంత్రివ‌ర్గంలో చ‌ర్చిస్తామ‌ని.. స్త్రీ శ‌క్తి ప‌థ‌కాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని వివ‌రించారు.

ఏంటీ ప‌థ‌కం?

స్త్రీ శ‌క్తి పేరుతో కూట‌మి ప్ర‌భుత్వం.. రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని అమ‌లు చేస్తున్నది. గ‌త ఏడాది ఆగ‌స్టులో సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా.. మ‌హిళ‌లు త‌మ ఆధార్‌ను చూపించి ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణించే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. త‌ద్వారా.. అప్ప‌టి వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాలు వినియోగిస్తున్న యువ‌తులు, మ‌హిళ‌లు, కాలేజీ విద్యార్థినులు సైతం.. ఆర్టీసీ బ‌స్సుల‌ను ఆశ్ర‌యిస్తున్నా రు. ఫ‌లితంగా ర‌హ‌దారిపై ప్ర‌మాదాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌న్న‌ది అధికారులు చెబుతున్న మాట‌.

Tags:    

Similar News