కొలికపూడి ధిక్కారం.. చంద్రబాబు ఏమీ చేయలేరా?
పదేపదే క్రమశిక్షణను అతిక్రమిస్తున్నా, అధిష్టానం నుంచి చీవాట్లు తింటున్నా ఎమ్మెల్యే తన ప్రవర్తనను మార్చుకోవడం లేదని అంటున్నారు.;
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధిక్కారంపై పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృత చర్చ జరుగోతంది. క్రమశిక్షణకు అతిపెద్ద పీట వేసే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు పదేపదే అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నా, అదుపు చేయలేని పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని అంటున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి తీరు వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించినా, అధిష్టానం చేష్టలుడిగి చూడటం అంతుచిక్కడం లేదని అంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని అంటున్నా, ఆయన మాత్రం తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. దీనివల్ల పార్టీలో ఇలాంటి సంస్కృతి పెరిగిపోయే ప్రమాదం ఉందని సీనియర్లు భయపడుతున్నారు.
ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణా రాహిత్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించే కొలికపూడి టీడీపీ అధిష్టానం సహనాన్ని పరీక్షిస్తున్నారని అంటున్నారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా పార్టీకే ఇబ్బంది అన్నట్లు కొలికపూడి సంకేతాలు పంపుతున్నట్లు భావిస్తున్నారు. అధిష్టానానికి సన్నిహితుడిగా పేరున్న ఎంపీ కేశినేని చిన్నితో బహిరంగ యుద్ధానికి కొలికపూడి సై అంటున్నారు. ఇప్పటికే ఒకసారి ఎంపీ చిన్నితో విభేదాల కారణంగా క్రమశిక్షణ కమిటీ విచారణను ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ఎంపీపై ఆరోపణలకు ఆధారాలు చూపలేదని పార్టీ పెద్దల చీవాట్లు తిన్నారు. ఇక తాజాగా వేలాది మంది సమక్షంలో ఎంపీని అవమానించేలా ఎమ్మెల్యే ప్రవర్తించడం సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీస్తోంది.
పదేపదే క్రమశిక్షణను అతిక్రమిస్తున్నా, అధిష్టానం నుంచి చీవాట్లు తింటున్నా ఎమ్మెల్యే తన ప్రవర్తనను మార్చుకోవడం లేదని అంటున్నారు. దీనికి కారణం తాను ఏం చేసినా, అధిష్టానం ఏమీ చేయలేదన్న ధీమానే కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా తప్పు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 164 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు ఒక ఎమ్మెల్యే విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక ఎమ్మెల్యే దూరమైనా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదుకదా? అంటున్నారు. అయితే కొలికపూడిపై చర్యలు తీసుకునే విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది.
క్రమశిక్షణ ధిక్కారం ద్వారా పదేపదే కవ్విస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి ఏమైనా రహస్య అజెండాతో పనిచేస్తున్నారా? అనే అనుమానం, ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి నష్టం చేసే వ్యూహంతో కొలికపూడి పనిచేస్తున్నారనే అభిప్రాయం ఆయనపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడిపై వేటు వేసి ఆయనకు స్వేచ్ఛనిస్తే పార్టీకి నష్టం చేసేలా మరింత ఎక్కువగా మాట్లాడొచ్చనే ఆలోచనతోనే చంద్రబాబు కఠినంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. అదేసమయంలో కొలికపూడిపై చర్యలు తీసుకుంటే, ప్రత్యర్థులు సామాజిక కోణంలో విమర్శలు చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ కారణాల వల్లే వ్యూహాత్మకంగా కొలికపూడిని వదిలేశారని వ్యాఖ్యానిస్తున్నారు.