ప్రపంచంలోనే రద్దీ ఎయిర్‌పోర్ట్‌కు షాక్.. ఖాళీ అయిన దుబాయ్ విమానాశ్రయం

ఆసియా దేశాల నుంచి అమెరికా లేదా యూరప్ వెళ్లాలనుకునే ఏ ప్రయాణికుడైనా దుబాయ్‌ను ఒక ప్రధాన కనెక్టింగ్ పాయింట్‌గా ఎంచుకుంటారు.;

Update: 2026-03-03 17:58 GMT

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడూ వేలాది మంది ప్రయాణికులతో, విమానాల రొదతో హోరెత్తిపోయేల వుండేది.కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయాన్ని బోసిపోయేలా చేశాయి. రోజుకు వెయ్యికి పైగా విమానాలు రాకపోకలు సాగించే చోట, ఇప్పుడు పట్టుమని పది ఇరవై విమానాలు కూడా కనిపించడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

వెయ్యి నుంచి ఇరవైకి.. ఊహించని పతనం:

విడిరోజుల్లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అంటే ఒక చిన్న ప్రపంచంలా ఉంటుంది. రోజుకు సగటున 1,200కు పైగా విమానాలు ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయి. కానీ, మార్చి 2న 'ఫ్లైట్ రాడార్ 24' ట్రాకింగ్ డేటా చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రోజంతా కలిపి కేవలం 20 విమానాలు మాత్రమే రాకపోకలు సాగించాయి. అందులో 16 విమానాలు బయలుదేరగా, కేవలం 4 విమానాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్ అయ్యాయి. యుద్ధ భయంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకోవడం లేదా దారి మళ్లించడమే దీనికి ప్రధాన కారణం.

ప్రపంచానికి కనెక్టింగ్ పాయింట్.. ఇప్పుడు నిశ్శబ్దం:

ఆసియా దేశాల నుంచి అమెరికా లేదా యూరప్ వెళ్లాలనుకునే ఏ ప్రయాణికుడైనా దుబాయ్‌ను ఒక ప్రధాన కనెక్టింగ్ పాయింట్‌గా ఎంచుకుంటారు. ప్రపంచాన్ని కలిపే ఈ వారధి ఇప్పుడు యుద్ధం వల్ల తెగిపోయినట్లు కనిపిస్తోంది. ఇక రన్వేలు ఖాళీగా దర్శనమిస్తుండటం, టెర్మినల్స్‌లో జన సంచారం లేకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అంతా బోసిపోయింది. ఇక కొన్ని దశాబ్దాల కాలంలో దుబాయ్ విమానాశ్రయం ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. విమానాల రాక ఆగిపోవడంతో పర్యాటక రంగంపై కూడా దీని ప్రభావం గట్టిగా పడుతోంది.

యుద్ధ సెగ.. విమానయాన రంగానికి భారీ దెబ్బ:

పశ్చిమాసియాలో జరుగుతున్న దాడులు, గగనతల ఆంక్షల వల్ల విమానాలు ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. క్షిపణులు, డ్రోన్ దాడుల భయంతో పైలట్లు మరియు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఈ రూట్‌లోకి రావడానికి సాహసించడం లేదు. ఇక దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, విమానయాన సంస్థలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.ఇక దుబాయ్ వంటి బిజీ గా వుండే ఎయిర్‌పోర్ట్ ఇలా వెలవెలబోవడం అంతర్జాతీయ వాణిజ్యం మరియు ప్రయాణాల మీద యుద్ధం చూపుతున్న ప్రతాపానికి ఒక నిదర్శనం. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News