గ్రీన్ ల్యాండ్ స్వాధీనం కోసం వేగంగా అడుగులు.. బిల్లు పెట్టిన అమెరికా
గ్రీన్ ల్యాండ్ ప్రజలకు డబ్బు ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రణాళిక రచించింది.;
గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునేంత వరకు అమెరికా నిద్రపోయేటట్టు లేదు. గ్రీన్ ల్యాండ్ స్వాధీనం దిశగా అమెరికా అడుగులు ముందుకు పడుతున్నాయి అందులో భాగంగా రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రాండీఫైన్ ` గ్రీన్ ల్యాండ్ విలీనం- రాష్ట్రహోదా ` పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో గ్రీన్ ల్యాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ కు అవకాశం లభిస్తుందని రాండీఫైన్ పేర్కొన్నారు. అమెరికా వ్యతిరేక దేశాలు ఆర్కిటిక్ లో పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు సాగనివ్వమని తెలిపారు. ఆర్కిటిక్ లో రష్యా,చైనాను ఎదుర్కోవడానికి గ్రీన్ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం చాలా కీలకమని పేర్కొన్నారు.
గ్రీన్ ల్యాండ్ ప్రజలు ఏమంటున్నారు ..
గ్రీన్ ల్యాండ్ ప్రజలకు డబ్బు ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రణాళిక రచించింది. కానీ గ్రీన్ ల్యాండ్ నాయకులు మాత్రం అమెరికా ఆఫర్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని పేర్కొన్నట్టు తెలుస్తోంది. నాటో దేశాలు కూడా యూఎస్ వైఖరిపై ఆందోళనతో ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రీన్ ల్యాండ్ ప్రజల్లో ఉంది.
రష్యా, చైనాను బూచిగా చూపి..
ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనాలు పట్టుసాధిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. ఆ రెండు దేశాలను ఎదుర్కోవడానికి గ్రీన్ ల్యాండ్ స్వాధీనం కీలకమని మాట్లాడుతున్నారు. కానీ దీనిని అమెరికాలోని మరోవర్గం వ్యతిరేకిస్తోంది. జాతీయ భద్రత పేరుతో గ్రీన్ ల్యాండ్ ఆయిల్, రేర్ ఎర్త్ మెటల్స్, గ్యాస్ పై ట్రంప్ కన్ను వేశారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. వెనుజులాలో కూడా ఇదే తరహా వ్యవహారం నడిచిందని చెబుతున్నారు. డ్రగ్స్ సరఫరా ఆరోపణలతో వెనుజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసి, ఆదేశంలోని ఆయిల్, గ్యాస్, ఖనిజ సంసదపైన పట్టుసాధించారన్న ఆరోపణలు ఉన్నాయి.
నాటో దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి ?
డెన్మార్క్ , అమెరికా రెండూ నాటో దేశాలు. డెన్మార్క్ భూభాగమైన గ్రీన్ ల్యాండ్ స్వాధీనం చేసుకుంటే.. నాటో లక్ష్యం నీరుగారుతుంది. అప్పుడు నాటో దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్న. అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నాటో .. అమెరికా చర్యలతో కకావికలం అవుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే, ఇతర దేశాల నుంచి రక్షణ కోసం నాటో ఏర్పడింది. ఇప్పుడు నాటో దేశాల మధ్య సమస్య వస్తే నాటోకు అర్థం ఉండదు. నాటో ఉన్నా లేనట్టే అన్న వాదన ఉంది. కాబట్టి నాటో దేశాలు ట్రంప్ చర్యలపై ఎలా స్పందిస్తారు అన్నది ఇక్కడ కీలకం.