పాంగాంగ్‌ వద్ద ఉద్రిక్తత...చైనాకు దీటుగా భారత్ దళాలు

Update: 2020-09-09 17:31 GMT
కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత కూడా చైనా భారత సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఆగస్టు 7న తూర్పు లడఖ్‌లో చైనాకు చెందిన పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించాయి. భారత దళాలను రెచ్చగొట్టేందుకు గాలిలోకి కాల్పులు జరిపాయి. అయితే, డ్రాగన్ దళాలకు భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో తోకముడిచాయి. 45 ఏళ్ల తర్వాత లడఖ్ లో కాల్పులు జరగడం వెనుక చైనా కుట్ర దాగి ఉందని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాల్పుల స్థాయికి చేరడం ఆందోళనకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జనరల్‌ వీ ఫెంగ్‌ లు ఉద్రిక్తతలపై చర్చలు జరిపినా చైనా దూకుడు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పాంగాంగ్‌ ప్రాంతంలో చైనా సేనల కదలికలను గుర్తించిన భారత సైన్యం అప్రమత్తమైంది. దీంతో, డ్రాగన్ సేనలకు దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యం కూడా అదనపు దళాలను మోహరించింది.

చైనా కదలికలకు దీటుగా బదులిచ్చేందుకు భారత్ సైన్యం సిద్ధమైంది. పాంగాంగ్‌ ప్రాంతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) భారీ సంఖ్యలో దళాలను మోహరించింది. అంతేకాదు, ఆ ప్రాంతానికి ఆయుధ సామాగ్రిని తరలించింది. దీంతో, డ్రాగన్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఆ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించిందని, సుఖోయ్‌-30, ఎంఐజీలతో సహా పలు యుద్ధ విమానాలను సిద్ధం చేసిందని తెలుస్తోంది. ఆగస్ట్‌ 29 రాత్రిపూట చైనా దళాలు దొంగచాటు పాంగాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చాయి. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోకి వచ్చేందుకు డ్రాగన్ సైన్యం చేసిన చర్యలను భారత దళాలు తిప్పికొట్టాయి. అప్పటినుంచి పాంగాంగ్  సరిహద్దులో అలజడి రేపేందుకు పీఎల్ ఏ ప్రయత్నిస్తోంది. అయితే, పీఎల్ ఏ దళాలకు భారత సైన్యం దీటుగా బదులివ్వడంతో  చైనా దళాలు తోక ముడుస్తున్నాయి.
Tags:    

Similar News