రజనీ మరో చిరంజీవే.. తేల్చి చెప్పేసిన సర్వే

Update: 2018-01-17 13:16 GMT
సూపర్ స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించడంతో తమిళనాడులో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. అదే సమయంలో రజినీ ప్రభావం ఎంత.. రజినీ వల్ల ఇప్పుడున్న పార్టీల్లో ఎవరికి నష్టమన్న చర్చలూ మొదలయ్యాయి. అయితే.. దీనిపై ఇండియా టుడే ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో షాకింగ్ సంగతులు బయటపడ్డాయి. రజినీ వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేరని - ఆయన సీఎం కాలేరని ఈ సర్వే తేల్చింది.
    
తమిళనాడులో ఎంతోకాలంగా అన్నాడీఎంకే - డీఎంకే మధ్యే పోటీ ఉంటోంది. కానీ.. జయలలిత మరణం తరువాత ఇప్పుడు తమిళనాడుపై అందరూ కన్నేశారు. ఇప్పటికే బీజేపీ వంటి బడా పార్టీలు ప్రయత్నాలు చేసి విఫలం కాగా ఇప్పుడు దిగ్గజ సినీ నటులు రజినీకాంత్  - కమల్ వంటివారు కూడా రాజకీయాల్లోకి వస్తుండడంతో జనం ఎలా స్పందించనున్నారన్న ఆసక్తి ఏర్పడుతోంది.  ఈ నేపథ్యంలో ఇండియా టుడే- కార్వీ సంస్థతో కలిసి ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించింది.
    
రజనీ రాక వల్ల అన్నాడీఎంకేకు ఎక్కువ‌ నష్టం వాటిల్లుతుందని ఈ పోల్ సర్వే చెబుతోంది. రజనీకాంత్‌ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని కూడా ఈ పోల్‌ లో తేలింది. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో అన్నాడీఎంకే నుంచి 20 శాతం మంది, డీఎంకే నుంచి 16 శాతం మంది మాత్రమే తాము రజనీకాంత్‌ కు ఓటేస్తామని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రజనీకాంత్ పార్టీ 33 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఇండియాటుడే- కార్వీ సంయుక్త సర్వే చెబుతోంది. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 16 శాతం మంది మాత్రమే రజనీకాంత్‌ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్తేనే రజనీకి మంచిదని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజకీయ శూన్యతను రజనీ భర్తీ చేస్తారా అన్న ప్రశ్నకు మాత్రం 40 శాతం మంది అవును అని… 51 శాతం మంది కాదు అని సమాధానం చెప్పారు. 9 శాతం మంది రజనీ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పోల్‌ సర్వే చెబుతోంది. డీఎంకేకు 130 స్థానాలు రావచ్చని అంచనావేసింది.
Tags:    

Similar News