గ్లోబ‌రీనాతో పాటు మ‌రో సంస్థ‌కు రీవాల్యువేష‌న్ బాధ్య‌త‌!

Update: 2019-05-02 08:20 GMT
ఇంట‌ర్ ఫ‌లితాలు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు త‌ల‌నొప్పిని తీసుకురావ‌ట‌మే కాదు.. గ‌డిచిన ప‌ది రోజులుగా ఈ ఇష్యూ  సాగుతూనే ఉంది. రోజులు గ‌డిచే కొద్దీ ఈ ఇష్యూ మ‌రింత ముదిరిపోవ‌ట‌మే కాదు.. కేసీఆర్ స‌ర్కారును ఆగ‌మాగం చేస్తోంది. నాలుగు రోజులు చూసిచూడ‌న‌ట్లుగా ఉంటే.. ఇష్యూ సైడ్ ట్రాక్ ప‌ట్టేయ‌టం ఖాయ‌మ‌ని భావించిన ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు మింగుడుప‌డ‌ని రీతిలో మారుతున్నాయి.

ఇంట‌ర్ ఫ‌లితాల మీద నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో రీవాల్యువేష‌న్ విష‌యంలోకాస్త ఆల‌స్యంగా స్పందించిన ప్ర‌భుత్వం.. ఒక ప‌రిష్కారాన్ని ప్ర‌క‌టించింది. దీంతో.. ఈ విష‌యం ముగుస్తుంద‌ని భావించినా.. అలాంటి ప‌రిస్థితి లేదు. విప‌క్షాలు ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవ‌టం.. వ‌రుస పెట్టి ఆందోళ‌న‌లుచేప‌ట్టం ఒక ఎత్తు అయితే.. గ్లోబ‌రీనా సంస్థ‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లింకులు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌తో వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కిపోయింది.

ఇదిలా ఉంటే.. రీవాల్యువేష‌న్ బాధ్య‌త‌ను గ్లోబ‌రీనాకు మ‌ళ్లీ ఇవ్వ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్న వేళ‌.. ఇంట‌ర్ బోర్డు అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రీవాల్యువేష‌న్ ప్ర‌క్రియ త‌ర్వాత ఫ‌లితాల నిర్వ‌హ‌ణ‌కు సంబందించి గ్లోబ‌రీనాతో పాటు.. మ‌రో స్వ‌తంత్ర ఐటీ సంస్థ‌కు కూడా బాధ్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఫ‌లితాల్లో త‌ప్పుల విష‌యంలో గ్లోబ‌రీనా వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తున్న నేప‌థ్యంలో.. ఆ సంస్థ‌కు స‌మాంత‌రంగా మ‌రో సంస్థ చేత ఫ‌లితాల ప్రాసెసింగ్ చేయించాల‌ని త్రిస‌భ్య క‌మిటీ సూచించిన నేప‌థ్యంలో ఇంట‌ర్ బోర్డు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. ఈసారి ఎంపిక చేసే ఐటీ సంస్థ ఏదై ఉంటుంది?  అది కూడా రాజ‌కీయ సంచ‌ల‌నానికి కార‌ణ‌మ‌వుతుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News