ఒక్క‌ ఫోన్ కాల్‌ తో వెనుదిరిగిన ఎమ్మెల్యే

Update: 2016-09-30 07:02 GMT
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రిని కలవాలనుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అడిగితే సీఎం టైం ఇవ్వకుండా ఉంటారా?... సీఎంఓ నుంచి అనుమ‌తి వ‌చ్చేసింది. ముఖ్యమంత్రిని కలిసేందకు ఉత్సాహంగా బయలుదేరిన సదరు తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యేకు ఊహించని షాక్ తగిలింది. దారిలో ఉన్న ఆయనకు వచ్చిన ఓ ఫోన్ కాల్ తో షాక్ త‌గిలింది. ఫ‌లితంగా ముఖ్యమంత్రిని కలవాల్సిన ఉన్నా.. వెనక్కి వెళ్లిపోయిన అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది.

ఇంతకీ.. ఆ ఎమ్మెల్యే ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. మెదక్ జిల్లా పటాన్ చెర్వు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. గురువారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాల్సి ఉంది. ఇందుకోసం ఆయన కారులో బయలుదేరారు కూడా. అయితే.. ఆయన దారిలో ఉన్నప్పుడు వచ్చిన ఒక ఫోన్ కాల్ తో ఆయన ఒక్కసారి షాక్ తిన్నారు. తన ఇంటిపైనా.. తన పిల్లల ఇంటి మీద ఏకకాలంలో ఐటీ అధికారులు దాడి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆయన అవాక్కయ్యారు. ముఖ్యమంత్రిని కలవాల్సి ఉన్నా.. ఐటీ అధికారులు తన ఇంటి మీదా.. తన వాళ్ల ఇళ్ల మీదా తనిఖీలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకొని వెనుదిరిగారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు.. జీఎంఆర్ కన్వెక్షన్ సెంటర్.. సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసం.. నిజాంపేటలోని ఎమ్మెల్యే కుమార్తె ఇల్లు.. బంజారాహిల్స్ లోని ఆఫీసు మీద ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టటం గమనార్హం. ఓ ఏడాదిలో కట్టాల్సిన ఇన్ కం ట్యాక్స్ రెండు నెలలు ఆలస్యమైందని.. అందుకే తనిఖీలు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే చెబుతున్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. రెండు నెలలు పన్ను ఆలస్యంగా కడితేనే.. ఏకకాలంలో అంత భారీగా దాడులు జరుపుతారా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేపై ఐటీ అధికారుల దాడి ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. చర్చగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News