ఐదేళ్లలో భారత పౌరసత్వం వదులుకున్నది 6 లక్షల మంది

Update: 2021-12-01 15:30 GMT
గత ఐదేళ్లలో.. 2017 నుంచి 2021 మధ్య ఆరు లక్షలమంది పైగా భారతీయులు పౌరసత్వం వదులుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561, 2019లో 1,44,017, 2020లో 85,248, 2021లో సెప్టెంబరు 30 నాటికి 1,11,287 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దరఖాస్తు చేసుకున్నది ఎందరంటే..

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద అర్హులైన వ్యక్తులు నిబంధనలను నోటిఫై చేసిన తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రమంత్రి లోక్‌సభకు తెలిపారు. కాగా, 2016- 2020 మధ్య కాలంలో.. 10,645 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా 4,177 మందికి పౌరసత్వం అందించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

2016లో మొత్తం 2,262 మంది దరఖాస్తు చేసుకోగా, 2017లో 855 మంది, 2018లో 1,758 మంది, 2019లో 4,224 మంది, 2020లో 1,546 మంది భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువగా పాకిస్తాన్ ప్రజలే ఉన్నారన్నారు.

మొత్తం 7,782 మంది పాకిస్తానీలు, అఫ్గానిస్థాన్ నుంచి 795 మంది, అమెరికా నుంచి 227 మంది, బంగ్లాదేశ్ నుంచి 184,నేపాల్ నుంచి 167, కెన్యా నుంచి 185 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇక, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 33,83,718 అని నిత్యానంద రాయ్ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ మినహా కుల గణన జరుగలేదు

కులాలవారీగా జనగణనపై నిత్యానంద రాయ్ స్పందిస్తూ... స్వాతంత్ర్యం తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టలేదని చెప్పారు. రాజ్యాంగంలో పొందుపర్చినట్లుగా షెడ్యూలు కులాలు, తెగల వివరాలనే సేకరిస్తున్నామన్నారు. 2021 జనగణనపై 2019 మార్చిలోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. అయితే కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. సంబంధిత మంత్రులతో సమావేశమైన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పస్టం చేశారు.


Tags:    

Similar News