హైద‌రాబాద్ లో ఆరాచ‌క డ్ర‌గ్ త‌యారీ.. తెలిస్తే షాకే!

Update: 2019-05-04 05:17 GMT
ఎక్క‌డో దూర‌న ఉన్న బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రం. అక్క‌డి మెజిస్టిక్ థియేట‌ర్ స‌మీపంలో ఒక ట్రాలీలో గ‌న్నీ బ్యాగ్‌. అందులో ఒక డ్ర‌గ్ ఉంద‌న్న స‌మాచారంతో ఉరుకులు ప‌రుగులు పెడుతూ వెళ్లారు బెంగ‌ళూరు నార్కోటిక్స్ కంట్రో బ్యూరో అధికారులు.అక్క‌డి గ‌న్నీ బ్యాగ్ ను స్వాధీనం చేసుకొని.. ఆ డ్ర‌గ్ ఏమై ఉంటుంద‌ని ప‌రీక్షించిన అధికారుల‌కు షాక్ తిన్న ప‌రిస్థితి. సెక్స్ డ్ర‌గ్ గా పిలిచే కేట‌మైన్ ను పెద్ద ఎత్తున ల‌భించింది.

ఇది ఎక్క‌డ నుంచి వ‌చ్చింది.. ఎవ‌రి హ‌స్తం ఉంద‌న్న ఆరా తీసిన‌ప్పుడు దాని మూలం హైద‌రాబాద్ అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. గుర్రాల‌తో పాటు.. మ‌నుషుల్లో ఈ డ్ర‌గ్ వాడిన‌ప్పుడు వారి సెక్స్ సామ‌ర్థ్యం విప‌రీతంగా పెర‌గ‌ట‌మే కాదు..వారి తీరు ఆరాచ‌కంగా మారుతుంది. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ డ్ర‌గ్ పై నిషేధం ఉంది.

అలాంటి డ్ర‌గ్ ను హైద‌రాబాద్ లోని నాచారం ప‌రిధిలోని ఇంకెమ్ సంస్థ త‌యారు చేస్తున్న‌ట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ కంపెనీని సీజ్ చేశారు. విస్తుగొలిపే విష‌యం ఏమంటే.. బెంగ‌ళూరులో బ‌య‌ట‌ప‌డ్డ ఈ డ్ర‌గ్ కు సంబంధించి బాధ్యులు ఎవ‌ర‌న్న విష‌యంపై ఆరా తీసిన‌ప్పుడు బెంగ‌ళూరులోని కెంగేరి శాటిలైట్ టైన్ ప్రాంతానికి చెందిన శివ‌రాజ్ గా గుర్తించారు. అత‌డి ఇంటిపైకి దాడి చేసి అత‌డ్ని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి ద‌గ్గ‌ర నుంచి 26 కేజీల నిషేధిత డ్ర‌గ్ దొర‌క‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ లెక్క‌ల ఎంత పెద్ద మొత్తంలో ఈ డ్ర‌గ్ ను త‌యారు చేస్తున్నార‌న్న సందేహం రాక మాన‌దు.  ఇదంతా ఒక ఎత్తు అయితే.. శివరాజ్ ఇంట్లోనే ఈ డ్ర‌గ్ త‌యారీ యంత్రం ల‌భించ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఈ డ్ర‌గ్ ను త‌యారీ యంత్రాన్ని ఎవ‌రూ ఇళ్ల‌ల్లో ఉంచుకోరు. ఎందుకంటే.. మూసి ఉంచిన గ‌దిలో ఈ డ్ర‌గ్ త‌యారీ ప్రాసెస్ చాలా ప్ర‌మాద‌క‌రం. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. చిన్న పొర‌పాటు దొర్లినా భారీ విస్పోట‌నం చోటు చేసుకునే డేంజ‌ర్ పొంచి ఉంటుంది. అలాంటిది జ‌నావాసాల మ‌ధ్య ఈ త‌ర‌హా యూనిట్ ను గుర్తించ‌టం దేశంలోనే ఇదే తొలిసారి కావ‌టం గ‌మ‌నార్హం. ఈ డ్ర‌గ్ త‌యారీలో శివ‌రాజ్ కు మంచి ప‌ట్టు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

శివ‌రాజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అత‌డ్ని విచారించ‌గా.. ఇదే త‌ర‌హా యంత్రం హైద‌రాబాద్ లోని నాచారంలో ఉన్న ఇంకెమ్ సంస్థ‌లోనూ ఉంద‌ని చెప్ప‌టంతో.. హైద‌రాబాద్ యూనిట్ కు స‌మాచారం అందించారు. దీంతో.. వారు హుటాహుటిన నాచారం వెళ్లి ఇంకెమ్ సంస్థ‌లో ఉన్న యంత్రాన్ని స్వాధీనం చేసుకోవ‌టంతో పాటు.. సంస్థ‌ను సీజ్ చేశారు. 

సెక్స్ డ్ర‌గ్ గా పిలిచే దీంతో కోట్లాది రూపాయిలు ఆర్జిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బెంగ‌ళూరు.. గోవా త‌దిత‌ర ప్రాంతాల‌కు ఈ డ్ర‌గ్ ను పంపుతున్న‌ట్లుగా గుర్తించారు. కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో ఏకంగా డ్ర‌గ్ త‌యారీ పెట్ట‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. సెక్స్ డ్ర‌గ్ గా చెప్పే కెటామిన్.. వాడిన వారు పైశాచిక ఆనందంతో మృగాళ్ల మాదిరి ప్ర‌వ‌ర్తిస్తార‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంత‌టి అపాయ‌క‌ర డ్ర‌గ్ ను ఫ్యాక్ట‌రీలో త‌యారు చేయ‌టం చూస్తే.. బ‌య‌ట‌కు రాని మ‌రెన్ని ఆరాచ‌కాలు ద‌ర్జాగా సాగుతున్నాయ‌న్న సందేహం రాక మాన‌దు.
Tags:    

Similar News