జగన్ కోసం క్యూ కడుతున్న అధికారులు

Update: 2019-05-28 04:46 GMT
ఏపీలో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ కోసం తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్  - ఐపీఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. నిన్న సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర.. తెలంగాణ ఐజీ పోస్టు నుంచి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వెళ్లడానికి  రెడీ అయ్యారు. ఇందుకు వైఎస్ జగన్ చొరవ చూపడం.. కేసీఆర్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో ఆయన ఏపీకి వెళ్లడం త్వరలోనే జరగనుంది.

ఇక ఇప్పుడు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా జగన్ పాలనలో పనిచేయాలని దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్ హయాంలో మైనింగ్ శాఖ చూసిన సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మీ  ఇప్పటికే జగన్ తో మాట్లాడారని.. ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారని సమాచారం. జగన్ కూడా ఇందుకు అంగీకరించారని తెలుస్తోంది.

శ్రీలక్ష్మీ ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత నిర్ధోషిగా బయటకు వచ్చిన ఆమె తెలంగాణలో ఐఏఎస్ గా కొనసాగుతున్నారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈమె అతిచిన్న వయస్సులో ఐఏఎస్ గా ఎంపికయ్యారు. తెలంగాణ - ఆంధ్రా విభజన సమయంలో తెలంగాణకు కేటాయించబడ్డారు.

ఇక ఏపీలో జగన్ గెలవడంతో అక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏపీకి వెళ్లడానికి కేంద్రానికి - తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈమెను పంపడానికి సానుకూలంగా స్పందించారు.ఇక జగన్ కోసం మరికొందరు ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులు కూడా డిప్యూటేషన్ పై ఏపీకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వైఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ - ఐపీఎస్ లు జగన్ వద్ద పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.


Tags:    

Similar News