విన్నంతనే మర్చిపోలేరు.. భార్య శవం పక్కనే 16ఏళ్లుగా నిద్ర

Update: 2020-08-03 06:50 GMT
ఇదో భిన్నమైన ప్రేమ కథ. విన్నంతనే.. ఇలా కూడా ఉంటుందా? అన్న భావన కలుగక మానదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య మరణించిన నేపథ్యంలో.. భార్య శవం పక్కనే గడిచిన పదహారేళ్లుగా నిద్రపోతున్న వైనం ఇప్పుడు బయటకు వచ్చింది. తాజాగా వైరల్ గా మారిన ఈ ఉదంతం ఆద్యంతం ఊహకు అందనట్లుగా ఉంటుంది. ఎంత ప్రేమించిన వ్యక్తే అయినా.. మరణించిన తర్వాత.. అంతే ప్రేమను పంచుతూ ఉండటం చాలా కష్టం. అందుకు భిన్నంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు.

వియత్నాంకు చెందిన లీ వ్యాన్ కు 1975లో వివాహమైంది. భార్య..భర్తలిద్దరు అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరికి చిన్న వయసులోనే పెళ్లి కావటంతో వారిద్దరి మధ్య స్నేహం ఎక్కువగా ఉండేది. వీరి ప్రేమకు నిదర్శనంగా ఏడుగురు పిల్లలు పుట్టారు. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో విధి వీరి పట్ల క్రూరంగా చూసింది. ఉద్యోగ రీత్యా సైన్యంలో పని చేసే లీ.. విధి నిర్వహణలో ఉండగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య చనిపోయిందన్న సమాచారం అందింది. హుటాహుటిన ఇంటికి బయలుదేరాడు. కానీ..ఆమె ముఖాన్ని ఎక్కువసేపు చూడలేకపోయారు. ఆలస్యమైతే.. ఆమె శవం పాడవుతుందన్న ఉద్దేశంతో అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి రోజు రాత్రి అతడి నిద్ర.. భార్య సమాధి పక్కనే.

అలా నెలలు గడిచాయి. ఒక రోజు వర్షం భారీగా పడటంతో భార్య సమాధి పక్కన పడుకోలేకపోయాడు. దీంతో.. సమాధి పక్కన చిన్న గొయ్యిలా తవ్వి.. అందులో పడుకున్నాడు. ఇది తెలిసిన పిల్లలు.. తండ్రిని మందలించి ఇంటికి తీసుకెళ్లారు. అయినప్పటికీ.. అతడి మనసు మాత్రం చనిపోయిన భార్య చుట్టూనే తిరుగుతోంది. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న అతడు.. సమాధిని తవ్వి.. ఆమె ఆస్థికల్ని తీసుకొని ఇంటికి వచ్చాడు.పడక గదిలో వాటిని పెట్టుకొని నిద్రపోయేవాడు. కుళ్లిన స్థితిలో ఉన్న ఆస్తికల్ని చూసి బాధ పడి.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మగా తయారు చేయించాడు. అందులో ఆస్థికల్ని ఉంచాడు.

ఈ విషయం తెలిసిన లీ పిల్లలు తండ్రితో గొడవపడ్డారు. తల్లి ఆస్థికలు సమాధిలో లేకుంటే ఆమె ఆత్మకు శాంతి ఉండదని వాదించారు. అయినా.. తన పట్టును వీడలేదు. ఈ విషయాలు తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని ఒప్పించాలని చూసిన పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో.. పోలీసులు సైతం వెనకడుగు వేశారు.

లీ విషయానికి వస్తే.. నిత్యం భార్య బొమ్మను శుభ్రం చేయటం.. వాటికి కొత్త బట్టలు వేయటం.. పెదాలకు లిప్ స్టిక్ వేయటం లాంటివి చేస్తుంటాడు.ఆమె బతికి ఉన్నప్పుడు సరైన బట్టలు కొనేంత స్థోమత లేదని.. అందుకే.. తన భార్యకు ఇప్పుడు మంచి బట్టలు వేస్తున్నట్లు చెబుతాడు. అనారోగ్యంతో కొంతకాలం వీల్ ఛైర్ లో ఉన్నా.. భార్య శవానికి సపర్యలు చేయటం మాత్రం ఆపలేదు. తన చివరి క్షణం వరకు తాను తన భార్యతోనే ఉంటానని చెబుతాడు. జనాలు వింతగా చూసినా తనకు పట్టదని స్పష్టం చేసే అతగాడు భార్యను ప్రేమించే తీరు తెలిసిన వారంతా విస్మయానికి గురవుతారు. ఇలాంటి అరుదైన ప్రేమలు ఆలోచనలకు కూడా సాధ్యం కావేమో కదూ?
Tags:    

Similar News