ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తర్వాత మొదటి రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది?

Update: 2022-08-16 15:30 GMT
భారత వారెన్ బఫెట్.. దేశీయ స్టాక్ మార్కెట్ రాకీగా పేరున్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకస్మిక మరణం తర్వాత మొదలయ్యే మొదటి రోజు ఎలా ఉంటుంది? స్టాక్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది. ఆయన భారీగా పెట్టుబడులు పెట్టి ఉన్న కంపెనీల పరిస్థితి ఏమిటి? ఇలా.. బోలెడన్ని క్వశ్చన్లతో ఈ రోజు సెషన్ ఓపెన్ కావటం తెలిసిందే. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం (ఆగస్టు14) ఉదయం హఠాన్మరణం చెందటంతో యావత్ దేశం షాక్ తిన్నది.

సాధారణప్రజలకు ఆయన తెలియకపోవచ్చు కానీ.. చాలామందికి ఆయన సుపరిచితుడే. సోమవారం ఆగస్టు 15 కారణంగా స్టాక్ మార్కెట్ కు సెలవుదినం. దీంతో.. ఆయన మరణించిన రెండోరోజున మొదలైన స్టాక్ మార్కెట్ మీద బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. ఆయన భారీగా పెట్టుబడులు పెట్టిన  కంపెనీల షేర్లు ఏమైనా ప్రభావితం అవుతాయా? ఈ కారణంగా స్టాక్ మార్కెట్ కుదుపులకు లోనవుతుందా? అన్న సందేహాలకు ఈ రోజుస్టాక్ మార్కెట్ సమాధానం ఇచ్చింది.

ఈ రోజు మార్కెట్ ముగిసే నాటికి స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. దేశీయంగా వెలువడిన గణాంకాలు మార్కెట్లను నడిపించాయి. రిటైల్.. టోకు ధరల ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టటం.. విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడులు పెడుతుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీంతో రోజు మొత్తం సూచీలు లాభాల్లోనే నడిచాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి నిఫ్టీ 17,800 ఎగువకు ఉండగా.. సెన్సెక్స్ 59,675 పాయింట్ల వద్ద మొదలై లాభాల స్వీకరణతో 59,923 వద్ద ముగిసింది.

ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు భారీగా ఉన్న అప్ టెక్ షేరు సైతం స్వల్ప నష్టానికి ముగిసింది. శుక్రవారం 233.90కు ముగిసిన ఈ షేరు ఉదయం ఒడిదుడుకులకు లోనైంది. ఒక దశలో 222.35కు తగ్గింది. ఉదయం 11 గంటల సమయానికి 219.5కు పడిపోయింది.

కానీ చివర్లో కోలుకొని 232.30వద్ద క్లోజైంది. అంటే.. ఝున్‌ఝున్‌వాలా మరణం ఈ షేరు మీద పెద్ద ప్రభావం చూపించలేదనే చెప్పాలి. ఇదే విధంగా ఆయనపెట్టుబడులు పెట్టిన షేర్ల ధరలు పెద్దగా ప్రభావితం కాలేదు. స్టాక్ మార్కెట్ దూకుడుకు ఆయన మరణం ఎలాంటి బ్రేకులు పడలేదనే చెప్పాలి.

మంగళవారం  ట్రేడింగ్ లో మహీంద్రా అండ్ మహీంద్రా.. మారుతీ.. ఏషియన్ పెయింట్స్.. హిందుస్థాన్ యూనిలీవర్.. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారతీ ఎయిర్ టెల్.. బజాజ్ ఫైనాన్స్.. టీసీఎస్.. ఎన్టీపీసీ షేర్లు స్వల్పంగా నష్టాలు నమోదు చేశాయి. మొత్తంగాచూస్తే.. ఈ రోజు మార్కెట్ ఆశాజనంగా సాగటమే కాదు.. పెద్ద ఎత్తున లాభాల్ని నమోదు చేసుకుందని చెప్పాలి.
Tags:    

Similar News