హైకోర్టులో టీ కి మెచ్చుకోలు..ఏపీకి తిట్లు పడ్డాయి

Update: 2015-12-01 04:20 GMT
తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న రైతుల ఆత్మహత్యలపై  హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కితాబు లభిస్తే.. ఏపీకి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ సర్కారు స్పందన చక్కగా ఉందని.. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ స్పందన ఏ మాత్రం సరిగా లేదంటూ మండిపడింది. రైతుల ఆత్మహత్యలపై కోర్టు అడుగుతున్న ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం సరిగా స్పందిస్తోందని పేర్కొంది.

అదే సమయంలో.. కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ సర్కారు సమాధానాలు చెప్పటం లేదని అసహనం వ్యక్తం చేసింది. రైతుల ఆత్మహత్యల అంశంపై హైకోర్టులో జరుగుతున్న విచారణకు ఏపీ సర్కారు తరపు ఏజీ విచారణకు హాజరు కాలేదు. దీంతో.. హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఏజీ.. అదనపు ఏజీ కోర్టుకు రాకపోతే కేసు వాయిదా వేయాల్సిందేనా? కోర్టు ప్రశ్నించినంతసేపు బదులివ్వకుండా కూర్చునే ఉంటారా? రైతుల ఆత్మహత్యలపై విచారణ జరుగుతుంటే స్పందించరా? అంటూ ఏపీ అధికారుల తీరుపై మండిపడింది. దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల మీద కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో.. తెలంగాణ సర్కారు స్పందన బాగుంటుందంటూ కితాబులిచ్చింది. తాజా పరిణామాలు చూస్తే.. అధికారుల తీరుతో ఏపీ సర్కారుకు తిట్లు పడితే.. తెలంగాణ సర్కారుకు ప్రశంసలు పొందిన పరిస్థితి.
Tags:    

Similar News