ఆపరేషన్ కమలపై సిట్ విచారణ

Update: 2019-02-12 13:30 GMT
కర్ణాటక శాసనసభలో బీజేపీ ప్రలోభాల ఆడియోలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కర్ణాటక శాసనసభ స్పీకర్, జేడీఎస్ నేత అయిన రమేష్ కుమార్ తో రూ.50 కోట్లకు డీల్ మాట్లాడిన ఆడియోను సీఎం కుమారస్వామి శుక్రవారం విడుదల చేశారు. దీనిపై సీరియస్ అయిన స్పీకర్ రమేష్ కుమార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలని సీఎం కుమారస్వామిని ఆదేశించారు. దీంతో సీఎం కుమారస్వామి ‘సిట్’ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా బీజేపీ ఆడియో టేపుల కలకలంలో ప్రధాన ఆరోపణలు బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్పపై వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆధీనంలోని ‘సిట్’ విచారణ ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటుందని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో స్పష్టం చేశారు. శాసనసభ కమిటీ లేదా జ్యూడిషియల్ కమిటీకి స్పీకర్ ఆదేశించాలని డిమాండ్ చేశారు.

స్పీకర్ ను ప్రలోభ పెట్టారన్న ఆడియో లీక్ కావడంతో శాసనసభ అట్టుడుకింది. దీనిపై స్పీకర్ విచారణకు ఆదేశించడం.. దాన్ని బీజేపీ అడ్డుకోవడంతో రసాభాసాగా మారింది. ఈ అంశంపై సోమవారం అంతా శాసనసభలో ఆందోళనలు మిన్నంటాయి.
Tags:    

Similar News