మంత్రులు, ఎంపీల ఎంపిక కేటీఆర్ చేతిలోనే..

Update: 2019-01-05 07:40 GMT
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి.. పార్టీపై పూర్తి అధికారాలు కట్టబెట్టాక టీ ఆర్ ఎస్ లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు లోక్ సభకు ఎంపీల ఎంపికతో పాటు ఎమ్మెల్యేల్లో ఎవరిని మంత్రులుగా చేయాలో పూర్తి అధికారులు కేటీఆర్ చేతిలో పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళితే కేటీఆరే ముఖ్యమంత్రి కావడంతో మంత్రివర్గం పై కేటీఆర్ కు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. పూర్తి నిర్ణయం కేసీఆర్ దే అయినా కేటీఆర్ బ్యాచ్ కూడా ఇందులో ఉండే అవకాశాలున్నాయి.

తాజాగా కేటీఆర్ కరీంనగర్ లో పర్యటించినప్పుడు తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ ను ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని.. ఆయనే కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తాడని ప్రకటించి కేటీఆర్ సంచలనం రేపారు. తెలంగాణ కోసం ఢిల్లీలో వినోద్ ఎంతో కష్టపడి పనులు సాధిస్తున్నాడని.. ఆయన్ను టీ ఆర్ ఎస్ కార్యకర్తలు కష్టపడి గెలిపించాలని కోరారు.

అయితే కరీంనగర్ నుంచి ఎంపీగా ఈసారి కేసీఆర్ పోటీచేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడని వార్తలొచ్చిన నేపథ్యంలో వినోద్ కే టికెట్ అని కేటీఆర్ ప్రకటించడం టీ ఆర్ ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ నుంచి వినోద్ పేరు ప్రకటించడంతో కేసీఆర్ మెదక్ నుంచే లోక్ సభకు పోటీచేయబోతున్నారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి టీ ఆర్ ఎస్ లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు చేసిన వివేక్ కు పెద్దపల్లి టికెట్ ఇవ్వడానికి కేటీఆర్ సిద్ధంగా లేడనే చర్చ టీ ఆర్ ఎస్ లో సాగుతోంది. వివేక్ ను టీ ఆర్ ఎస్ నుంచి సాగనంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక తన బావ, మాజీ మంత్రి హరీష్ రావుకు ఎంపీ సీటును ఇచ్చి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయించాలని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది కాదంటే రాజ్యసభ సీటు ఇచ్చి హరీష్ రావును జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి ఇక్కడ సీఎం పోస్టును తాను పదిల పరుచుకోవాలని కేటీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది. అలాగే కేసీఆర్ ప్రకటించే క్యాబినేట్ లో కేటీఆర్ కీలకపాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక మంత్రి పదవులు, ఎంపీ టికెట్ల కోసం అభ్యర్థులు ఇప్పుడు కేటీఆర్ వెంట పడుతున్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలవడం అంతా ఈజీ కాకపోవడంతో కేటీఆర్ ఏ సభకు, సమావేశానికి వెళ్లినా ఆయన చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి మంత్రి వర్గంలో అనుభవజ్ఞులు, యువ మంత్రులను మిక్స్ చేసి మిశ్రమ మంత్రివర్గాన్ని తయారు చేయాలని కేటీఆర్ కు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. దీంతో కేటీఆర్ ఈ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.





Full View
Tags:    

Similar News